పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తారా? అని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తే.. అప్పుడు మీతో పోటీకి వైసీపీ ‘సై అంటే సై’ అని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ కాబట్టి, ఆయన సభలకు యువత తరలి వస్తున్నారని అభిప్రాయపడ్డారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ స్టార్ అని, అందుకే ఆయనకు ప్రజాభిమానం ఉందని తెలిపారు.
భీమవరంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన కేవలం గోదావరి జిల్లాల్లోనే పోటీ చేస్తారా? ఆ జిల్లాలకే పరిమితమా? అని ప్రశ్నించారు. వైసీపీని ఓడించాలని, పవన్ కళ్యాణ్‌కి ఎందుకంత కక్ష అని నిలదీశారు. చంద్రబాబు అవినీతి పరిపాలన అందిస్తే, జగన్ మెరుగైన పాలన అందించారని.. చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గ్రహించాలని సూచించారు.
ఇక, సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు తలరుచుకుంటేనే కొంత మందికి బీపీ వస్తుందని మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. ఇక్కడ బీపీ అంటే.. చంద్రబాబు, పవన్ అని అభివర్ణించారు. పవన్ కళ్యాణ్‌కు నిర్దిష్టమైన ఆలోచన లేదని.. రాష్ట్రాభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ గాడిదలు కాశారా? అని మండిపడ్డారు. కనీసం ఓటు హక్కు కూడా ఉందో లేదో తెలియని వారే పవన్ సభలకు వస్తున్నారని తూర్పారపట్టారు.
పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే అల్లరిమూకల్ని చూసి.. సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని మార్గాని భరత్ అన్నారు. దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎం జగన్ 100 శాతం నిధులు సాధిస్తున్నారని.. 2024 ఎన్నికల్లో కేంద్రంలో ఎక్కువ సీట్ల సంఖ్య వైసీపీకి వస్తే, ప్రత్యేక హోదా కూడా లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.