మృత్యువు నుంచి ఓ మహిళ త్రుటిలో తప్పించుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని మందుల దుకాణానికి వెళ్తుండగా.. ఆమె స్పృహతప్పి పట్టాల మధ్య పడిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్ మీదుగా ఓ గూడ్సు రైలు దూసుకొచ్చింది. కానీ, ఆ మహిళ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబూపుర్ గ్రామానికి చెందిన హరి ప్యారీ (40) అనే మహిళ.. మందులు కొనేందుకు సహవర్ రైల్వేస్టేషన్ వైపు వెళ్లింది.
ఈ క్రమంలో పట్టాల మీదుగా నడుస్తూ అకస్మాత్తుగా తల తిరిగి.. స్పృహతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు.. ఆమెను ట్రాక్‌పై నుంచి పక్కకు తీసేందుకు పరుగెత్తారు. కానీ, అప్పటికే ఓ గూడ్సు రైలు అదే ట్రాక్‌పై నుంచి రావడంతో చేసేదేమీ లేక ఆగిపోయారు. కొన్ని వ్యాగన్లు హరి ప్యారీ పైనుంచి వెళ్లేసరికి ఆమెకు మెలకువ వచ్చింది. దీంతో కాళ్లు, చేతులు కదలకుండా ఉండాలంటూ స్థానికులు కేకలు వేసి ఆమెను అప్రమత్తం చేశారు. గూడ్సు వెళ్లిపోయిన తర్వాత ఆమెను ట్రాక్‌పై నుంచి పక్కకు తీశారు. అయితే, ఈ ఘటన హరి ప్యారీకి స్వల్పంగా గాయపడింది.
స్పృహ కోల్పోయిన తర్వాత ట్రాక్ పైన కాకుండా మధ్యలో పడిపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది. అదే, ట్రాక్‌పై పడుంటే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఏది ఏమైనా ఆమెకు ఈ భూమ్మీద నూకలున్నాయి. లేకపోతే పట్టాలుపై పడి.. పై నుంచి రైలు వెళ్లినా బతిబట్టగలిగేదు కాదు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.