ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఆవులపల్లి రిజర్వాయర్ పనులను కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను స్థానికులు ఉపసంహరించుకున్నారు. ఈ రిజర్వాయర్ పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై విచారణకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్‌జీటీ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌లో ఇంప్లీడ్ అప్లికేషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. దాంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని స్థానికుల తరఫు న్యాయవాది సమీర్ సోధి తెలిపారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.