గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిధులు ఇవ్వమని అడిగిన సర్పంచ్‌లపై పోలీసులతో దాడి చేయించిన జగన్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తనను నిధుల కోసం నిలదీస్తున్నారన్న అక్కసుతోనే జగన్ రెడ్డి నిన్న (సోమవారం) సర్పంచ్‌లపై తన ప్రతాపం చూపించారని మండిపడ్డారు. పంచాయతీలకు చెల్లించాల్సిన రూ.8,700 కోట్లను వెంటనే విడుదచేయాలన్నారు. దేశప్రగతికి పట్టుగొమ్మలుగా నిలవాల్సిన పల్లెలు జగన్ రెడ్డి దోపిడీకి బలయ్యాయన్నారు. నిధులు లేకుండా పల్లెల్లో పనులు చేయడం ఎలా సాధ్యమవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. వర్షాకాలంలో పల్లెల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్య తీవ్రప్రభావం చూపిస్తాయని తెలిపారు. వాటి పరిష్కారానికి నిధులు లేక, పనులు నిలిచిపోతే ప్రజల ఆరోగ్యానికే ప్రమాదమన్నారు. 14, 15వ ఆర్థికసంఘం నిధుల్ని ముఖ్యమంత్రి దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, తమ కుటుంబాలను బతికించుకోవడం కోసం సర్పంచ్‌లు కూలీ పనులు చేయడం, కాలువల్లో పూడికతీయడం, కూరగాయలు అమ్ముకోవడం చేస్తున్నారన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసినందుకు, తాము సర్పంచ్‌లుగా గెలిచినందుకు వైసీపీ సర్పంచ్‌లు తమ చెప్పులతో తామే కొట్టుకుంటున్నారని జవహర్ వ్యాఖ్యలు చేశారు.