రాష్ట్ర మహిళా కమిషన్‌పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సెటైర్ విసిరారు. విజయవాడలో నేడు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హాస్య ప్రదర్శన... ప్రవేశం ఉచితం... ఆసక్తి కలిగిన వారు తిలకించవచ్చు అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు సోషల్ మీడియా - మహిళలపై దాడి అంశంపై మహిళా కమిషన్ సదస్సు నిర్వహిస్తోంది. దీనిపై సుంకర తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దాదాపు నాలుగేళ్లకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నిద్ర లేచారన్నారు. ‘‘మహిళలపై సోషల్ మీడియా దాడి మహిళా కమిషన్‌కు ఇప్పుడే గుర్తకు వచ్చిందా?.. ప్రభుత్వంలోని తప్పులను ఎత్తి చూపితే సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాన్ని ఎవరు హననం దాడి చేస్తున్నారో మహిళా కమిషన్‌కు తెలియదా?. ప్రతిపక్ష పార్టీల్లోని మహిళలను టార్గెట్ గా చేసుకుని సమాజం సిగ్గుపడేలా పోస్టులు పెడుతున్నారో చైర్ పర్సన్‌కు అవగాహన లేదా?.. సోషల్ మీడియాలో కూలీలను పెట్టుకుని మరి ఎవరు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారో అందరికి తెలుసు. మీ వరకు వస్తే కానీ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీకు కనిపించలేదా? సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య పోస్టుల వల్ల మహిళలు మానసికంగా కుంగిపోతున్నారు. అన్ని తెలిసి కూడా మహిళా కమిషన్ సదస్సు నిర్వహించి ఎవరిని మభ్యపెడదామని?’’ అంటూ సుంకర పద్మశ్రీ ప్రశ్నల వర్షం కురిపించారు.