ఎనిమిదేళ్ల తమ్ముడిని 14 ఏళ్ల అన్న తుపాకీతో కాల్చిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. తల్లితో కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ మార్కెట్‌కు ఇద్దరు కుమారులను తీసుకువెళ్లిన తల్లి.. వారిని కారులోనే ఉంచి.. షాపింగ్‌కు వెళ్లింది. ఆమె భర్త పోలీస్ కాగా.. ఆయనకు సంబంధించిన సర్వీస్ రివాల్వర్ ఆ కారులోనే ఉండిపోయింది. అయితే అది గుర్తించిన పిల్లలు దాన్ని తీసుకుని ఆడుకున్నారు. అంతలోనే పెద్ద కుమారుడు.. ఆ తుపాకీతో తన తమ్ముడిని కాల్చాడు. ఈ శబ్దం విన్న స్థానికులు కారు డోరు తీసి గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
అమెరికాలోని ఓక్లహోమా నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓక్లహోమా సిటీ పోలీస్ విభాగంలో పనిచేసే ఓ అధికారి.. తన విధులు ముగించుకుని కారులో తుపాకీ పెట్టాడు. అయితే అదే సమయంలో ఆ కారును అతని భార్య తీసుకుని షాపింగ్‌కు వెళ్లింది. తనతోపాటే ఇద్దరు కుమారులను కూడా తీసుకువెళ్లింది. వారి వయసు 14 ఏళ్లు, 8 ఏళ్లు. అయితే షాపింగ్ కోసం వాల్‌మార్ట్‌కు వెళ్లిన ఆమె కారును పార్కింగ్‌లో పెట్టింది. అయితే వాల్‌మార్ట్ లోపలికి ఆమె ఒక్కతే వెళ్లి.. ఇద్దరు పిల్లలను కారులోనే ఉంచింది. దీంతో వారు అదే కారులో ఆడుకుంటూ ఉన్నారు.
కారులో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలకు తమ తండ్రికి చెందిన సర్వీస్ రివాల్వర్ దొరికింది. అయితే అది పేలుతుందని తెలియని అమాయకపు పిల్లలు దాంతో ఆడుకున్నారు. ఈ క్రమంలోనే 14 ఏళ్ల కుర్రాడు.. ఆ తుపాకీతో తన తమ్ముడి ఛాతిలో కాల్చాడు. దీంతో ఒక్కసారిగా బుల్లెట్ ఛాతిలోకి వెళ్లి వీపులో నుంచి బయటికి వచ్చింది. ఈ శబ్దంతో అక్కడే ఉన్నవారు అప్రమత్తమై కారు డోర్లు తెరిచారు. వెంటనే ఎమర్జెన్సీ పోలీసులకు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బుల్లెట్ గాయం అయిన బాలుడికి ప్రథమ చికిత్స చేశారు. రక్తస్రావం కాకుండా ఛాతిలో, వీపులో కట్లు కట్టారు. అయితే ఈ ఘటనతో తమ్ముడిని కాల్చిన 14 ఏళ్ల బాలుడు తీవ్ర భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాడు.
ఈ ఘటనలో గాయపడిన బాలుడు అప్పటికి మాట్లాడుతూ, స్పృహలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆస్పత్రికి తరలించేందుకు అత్యవసర హెలికాప్టర్ దూరంగా ఉండటంతో దగ్గర్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఓక్లహోమా ట్రామా సెంటర్‌కు తరలించారు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే ఈ ఘటనలో బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అతనికి త్వరలోనే ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు.
ఇటీవల వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్ ముందు ఆ వాల్‌మార్ట్‌లో పనిచేసే ఉద్యోగి తుపాకీతో ఆరుగురిని కాల్చిచంపాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వాల్‌మార్ట్ స్పందించింది. తమ ఉద్యోగి తమ వాల్‌మార్ట్ స్టోర్ ముందు చేసిన మారణకాండ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆ ఘటనలో చనిపోయిన ప్రజలు, తమ ఉద్యోగులకు ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేసింది. తాము చట్టాలకు అనుగుణంగా పనిచేస్తామని వాల్‌మార్ట్ యాజమాన్యం పేర్కొంది. అదే సమయంలో తమ ఉద్యోగులు, కస్టమర్లకు భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు చేపడతామని వాల్ మార్ట్ వెల్లడించింది.