ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16 ఏళ్లకు ఉద్యోగంలో చేరి 74 ఏళ్లుగా విధులు,,,,90 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసి మహిళ

international |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2023, 10:04 PM

ఉద్యోగాలు చేసే వారు సాధారణంగా ఎప్పుడో ఒక్పప్పుడు సెలవులు పెడుతూనే ఉంటారు. ఇక ప్రైవేటు ఉద్యోగం చేసే వారు రెక్కలు ముక్కలు చేసుకుని సంస్థ కోసం పనిచేస్తూనే ఉంటారు. మనిషి అన్నాక ఎన్నో అవసరాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉంటూనే ఉంటాయి. దాంతో ఎప్పుడో ఒకసారైనా ఉద్యోగానికి లీవు పెట్టాల్సిన అవసరం వస్తుంది. కొంత మంది ఆఫీసులకే వెళ్లకుండా నెల జీతం మాత్రం ఠంఛనుగా తీసుకునే వారిని కూడా చూశాం. కానీ ఓ మహిళ మాత్రం తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా లీవు పెట్టలేదు. తన 16 వ ఏట ఉద్యోగంలో చేరిన ఓ బాలిక.. 74 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించి.. 90 ఏళ్ల వయసులో గత నెలలో పదవీ విరమణ చేసింది. అమెరికాలో జరిగిన ఈ ప్రత్యేక సంఘటన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 74 ఏళ్ల ఉద్యోగ సమయంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఎలా పనిచేశారని.. నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.


అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన మెల్బా మెబానే వయసు 90 ఏళ్లు. ఆమె తన 90 వ ఏట గత నెలలో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. మెల్బా మెబానే 1949 లో 16 ఏళ్ల వయసులో ఉన్నపుడు ఓ డిపార్టుమెంట్‌ స్టోర్‌లో ఉద్యోగానికి ఎంపిక అయింది. అప్పటి నుంచి గత నెల వరకు నిర్విరామంగా విధులు నిర్వర్తించింది. తన 74 ఏళ్ల సర్వీస్‌లో ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాకుండా ఉండలేదని చెబుతున్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేవరకు అదే ఉత్సాహం, అదే నిబద్ధతతో మెల్బా మెబానే పనిచేసినట్లు ఆ డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ యాజమాన్యం వెల్లడించింది. ఏడు దశాబ్దాలకు పైగా ఒకే ఉద్యోగంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేయడం చాలా గ్రేట్ అని మెల్బా మెబానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ 74 ఏళ్ల ఉద్యోగ జీవితంలో అనారోగ్యం గానీ ఇతర అవసరాలతో ఒక్కరోజు కూడా లీవు తీసుకోలేదు. ఇటీవల మెబానే 90 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆమె గత నెలలో ఉద్యోగం నుంచి రిటైర్ అయినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.


మొదట 1949 లో మెబాన్ టేలర్‌ అనే డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఉద్యోగంలో చేరారు. 1956 లో ఆ డిపార్ట్‌మెంటల్‍‌ స్టోర్‌ను డిలార్డ్‌ అనే సంస్థ కొనుగోలు చేసింది. తొలుత లిఫ్ట్‌ ఆపరేటర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. అక్కడి నుంచి ఎక్కడికీ మారకుండా 74 ఏళ్ల పాటు అదే సంస్థలో పని చేశారు. ఆ షాపింగ్‌ మాల్‌లో దుస్తులు, కాస్మొటిక్‌ విభాగంలోనే చాలా కాలం విధులు నిర్వర్తించారు. మెబానే పదవీ విరమణ కార్యక్రమాన్ని డిలార్డ్ స్టోర్ ఘనంగా నిర్వహించింది. 74 ఏళ్ల పాటు తమ సంస్థలో పనిచేసి.. ఎంతో కృషి చేశారని ఆ స్టోర్ మేనేజర్ వెల్లడించారు. తమ కుటుంబ సభ్యుల్లో మెబానే ఒకరుగా మెలిగారని చెప్పారు. తన 74 ఏళ్ల కెరీర్‌లో కొన్ని వేలమందికి ఆమె శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఆమె కేవలం సేల్స్ ఉమెన్ మాత్రమే కాదని.. అందరికీ ఓ తల్లి లాంటిదని అందులో పనిచేసే ఉద్యోగులు పేర్కొన్నారు. ఉద్యోగ జీవితంలోనే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి సలహాలు, సూచనలు ఇస్తారని గుర్తు చేసుకున్నారు. ఆ స్టోర్‌లో ఆమె అన్ని విభాగాల్లోనూ పనిచేశారని.. తన పనితో అందరిపైన చెరగని ముద్ర వేశారని యాజమాన్యం తెలిపింది. ఆమె పదవీ విరమణ సందర్భంగా అత్యధిక కాలం స్టోర్‌లో పనిచేసినందుకు గౌరవంగా ఎక్సలెన్స్ అవార్డును ఆమెకు ప్రదానం చేశారు.


74 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేసిన మెబానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఇంట్లో కంటే ఆ స్టోర్‌లోనే ఎక్కువ సమయం గడిపానని గుర్తు చేసుకున్నారు. ఆ స్టోర్‌లో ఉన్నవారితో తనకు కుటుంబ సభ్యులకు ఉన్న అనుబంధం ఉందని ఆమె తెలిపారు. రోజూ క్రమం తప్పకుండా ఉద్యోగానికి రావడం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అందులో పనిచేసే వారు అంటే తనకు ఎంతో ప్రేమ అని వివరించారు. ఇక పదవీ విరమణ అనంతరం చేయాల్సిన పనులను కూడా ఆమె వివరించారు. రిటైర్మెంట్ తర్వాత తనకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటానని.. నచ్చిన ప్రదేశాలకు పర్యటనలు చేస్తానని ఆమె వెల్లడించారు. సుదీర్ఘ కాలం ఉద్యోగం చేశానని.. రిటెర్మెంట్ తర్వాత బాగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com