ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థులు లేని వాళ్లు, ఎమ్మెల్యేగా గెలవలేని వాళ్లు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఓడిస్తామని సవాల్ చేయడం కామెడీగా ఉందని రాష్ట్ర పర్యాటక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి అన్నారు. ‘‘ఓడిస్తాం.. ఓడిస్తాం.. అని చెప్పడానికి మీ అడ్డా కాదురా బిడ్డా.. ఆంధ్రప్రదేశ్ జగన్ అన్న అడ్డా.. ఓడించడం మీ తరం కాదు’ అని రోజా పేర్కొన్నారు.
ఈ మేరకు తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సంక్షేమ సామ్రాట్ అని అభివర్ణించారు. ప్రజల ఇంటికి వెళ్లి మరి సంక్షేమం అందిస్తున్న ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఇక, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కొలువైన దేవుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేరని రోజా జోస్యం చెప్పారు. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కళ్యాణ్‌కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్థులను పవన్ కళ్యాణ్ సొంతంగా నిలబెట్టాలని సవాల్ విసిరారు.
పవన్ కళ్యాణ్‌తో పాటు నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేగా గెలవాలని మంత్రి రోజా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు చేసిందేమీ లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శిచారు.