రాత్రిళ్లు ప్రయాణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రకాశం జిల్లా దర్శిలో.. అర్థరాత్రి బస్సు సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో.. ఏడుగురు చనిపోయారు.మరో 30 మంది గాయపడ్డారు. వారంతా పొదిలికి చెందిన వారని తెలిసింది.పెళ్లి బృందం వారు పొదిలి నుంచి.. అద్దెకు తీసుకున్న ఆర్టీసీ బస్సులో కాకినాడ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దాంతో పెళ్లింట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
బస్సు చాలా వేగంగా కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.రాత్రివేళ ప్రయాణాల్లో ఇలాంటి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై స్ట్రీట్ లైట్లు సరిగా వెలగకపోవడం, క్రాసింగ్ లైన్స్ సరిగా కనిపించకపోవడం, రోడ్లపైకి ఇసుక వస్తుండటం, ఇరుకు రోడ్లు ఇలా ఎన్నో రకాల కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.