టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో, పూర్ టు రిచ్ వినూత్నం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అర్థం చేసుకోవడం కష్టమైనా ఆచరణలో అద్భుత ఫలితాన్ని ఇస్తుందన్నారు. చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.. తాజా పరిణామాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యమే పీ-4 విధానమని తెలిపారు.. రాష్ట్రంలో పేదరికం ఉందన్నది ఎంత వాస్తవమో సంపద సృష్టి కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డారు.
మహిళాశక్తి ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతోందని.. ఈ విధానం పోవాలనే మినీ మేనిఫెస్టోలో మహాశక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యం కల్పించామన్నారు టీడీపీ అధినేత. మహిళలకు ఇప్పటివరకు ప్రకటించిన నాలుగు పథకాలే కాకుండా మరికొన్ని కార్యక్రమాలు చేసే ఆలోచన ఉందని తెలిపారు. కుటుంబం, సమాజం కోసం కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. తన చిన్నతనంలో కట్టెల పొయ్యిపై.. తన అమ్మ పడిన కష్టాలు ఎన్నో చూశాను అన్నారు. అమ్మ కష్టాలు చూసే ఆనాడు గ్యాస్ దీపం పథకం తీసుకొచ్చామన్నారు.
సీఎం జగన్ మూర్ఖత్వంతో అమరావతిని చంపేశారని మండిపడ్డారు చంద్రబాబు. అమరావతి ఉండి ఉంటే చాలా అద్భుతమైన నగరంగా పేరు దక్కేదని.. హైదరాబాద్‌లా అమరావతి మహనగరం అయ్యేదని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించే అమరావతిని జగన్ చంపేశారన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకటుకుంటోందని.. ఆడ్డబిడ్డ నిధి, తల్లికి వందనం, మహిళకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ మహిళల్లో ఆత్మగౌరవం నిలిపేందుకే ఈ పథకాలు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో ఎకరా అమ్మితే.. ఆంధ్రాలో 100 ఎకరాలు కొనవచ్చు అని చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
తాను గతంలో రోజు టెక్నాలజీ గురించి చెబితే ఎగతాళి చేశారని.. ఇవాళ అదే టెక్నాలజీ అందరికీ ఉపయోగపడుతుందన్నారు. కియా మోటార్స్ కేవలం క్రెడిబిలిటి వల్లనే వచ్చిందని.. ఐదేళ్లలో జగన్ ఒక బిల్డింగ్ కూడా కట్టలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని వనరులు ఏపీలోనే ఉన్నాయని.. పట్టిసీమ కడితే ఆనాడు ఎగతాళి చేశారని.. మరి ఈ రోజు పట్టిసీమ లేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేసేదని ప్రశ్నించారు చంద్రబాబు. పోలవరాన్ని కూడా జగన్ ముంచేశారన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని... అప్పటి వరకు వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పుకొచ్చారు. జగన్ లాంటి వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు.
భూముల సెటిల్‌మెంట్లు చేసి వేల కోట్లు సంపాదించారని.. ఋషికొండను కొట్టేసి బొడిగుండు చేశారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ 2లో ఉందని.. కౌలు రైతులు కూడా నాశనమయ్యారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పవర్ సెక్టార్‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చి విజయం సాధించామన్నారు. భవిష్యత్‌లో సోలార్, విండ్, ఎనర్జీ సెక్టార్స్‌కు మంచి భవిషత్తు ఉంటుందన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీతో త్వరలోనే పల్లె నిద్ర చేపడతాను అన్నారు. ప్రజలు ఇప్పటికైనా చైతన్య వంతులు కావాలని పిలుపునిచ్చారు.
పొత్తులపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించారు. తనకు ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు ముఖ్యమని.. దీనిపై ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకొచ్చి సెట్ చేయటమే తన ముందున్న లక్ష్యమన్నారు.పెద్ద బాధ్యత తనపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరమన్నారు. ఎవరెవరో మాట్లాడే వాటికి ఇప్పుడు స్పందించను అన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం-ప్రజలు గట్టిగా ఉంటే కేంద్రం ఎందుకు దిగి రాదనటానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ అన్నారు. గత నాలుగేళ్లలో జగన్ ఆ స్థాయి పోరాటానికి కనీస ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. ఓట్ల అవకతవకలపై ఢిల్లీని కూడా వదిలిపెట్టబోమన్నారు. అక్రమాలు సరిదిద్దకపోతే ఎన్నికల సంఘం విశ్వసనీయత లేకుండా పోతుందన్నారు.