ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూల్‌ డ్రింక్స్‌లో వాడే స్వీటెనర్ 'అస్పార్టేమ్'‌ కేన్సర్ కారకం..,,, డబ్ల్యూహెచ్ఓ ప్రకటన

international |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 10:10 PM

శీతల పానీయాలలో సాధారణంగా ఉపయోగించే కృత్రిమ చక్కెర అస్పార్టేమ్‌ను కేన్సర్ కారకంగా వర్గీకరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ  శుక్రవారం వెల్లడించింది. అయినప్పటికీ రోజువారీ తీసుకునే ఆమోదయోగ్యమైన పరిమితి స్థాయిలో మార్పు ఉండదని పేర్కొంది. అంతేకాదు, ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని సంస్థలకు, పూర్తిగా వినియోగించొద్దని వినియోగదారులకు తాము సలహా ఇవ్వడం లేదని తెలిపింది. కేవలం అవగాహన కోసమే సూచనలు ఇస్తున్నామని స్పష్టం చేసింది.


‘మేము ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని కంపెనీలకు సలహా ఇవ్వడం లేదు.. పూర్తిగా వినియోగించడం మానేయమని ప్రజలకు సలహా ఇవ్వడం లేదు.. కేవలం అవగాహన కోసమే సలహా ఇస్తున్నాం’ డబ్ల్యూహెచ్ఓ పోషకాహార, ఆహార భద్రత డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బ్రాంకా అన్నారు. కేన్సర్ వచ్చేందుకు ఆస్కారం ఉన్న ఇతర పదార్థాల్లో అలొవెరా (కలబంద), డీజిల్, ఆసియా దేశాల్లో ఎక్కువగా వాడే కూరగాయలతో చేసిన ఊరగాయలు ఉన్నాయి.


డబ్ల్యూహెచ్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ జూన్ 6 నుంచి 13 వరకు ఫ్రాన్స్‌లోని లియోన్‌లో జరిగిన సమావేశంలో అస్పార్టేమ్ కేన్సర్ కారకమని మొట్టమొదటిసారిగా అంచనా వేసింది. అస్పార్టేమ్ కారణంగా మానవుల్లో కేన్సర్ వచ్చే అవకాశం ఉందని ఐఏఆర్సీ బృందం వర్గీకరించినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపారు.


మనుషుల్లో కేన్సర్‌కు కారణమయ్యే అవకాశాలు ఉన్న గ్రూప్ 2బీలో అస్పార్టేమ్‌ను చేర్చింది. ప్రత్యేకంగా హెపాటోసెల్లర్ కార్సినోమాకు సంబంధించి (ఒక రకమైన కాలేయ కేన్సర్) అందుబాటులో ఉన్న పరిమిత సాక్ష్యాల ఆధారంగా దీనిని ఈ వర్గంలో చేర్చింది. జంతువులలో కేన్సర్‌కు సంబంధించి ప్రయోగాత్మకంగా పరిమిత ఆధారాలు ఉన్నాయి.


ఇక, టీ, కాఫీలలో ఉండే కెఫిక్ యాసిడ్‌‌, అలోవేరా గ్రూప్ 2బి కేటగిరీలో ఉందని లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్‌ కేన్సర్ ఎపిడిమియాలజీ ప్రొఫెసర్ పాల్ ఫారోహ్ చెప్పారు. గ్రూప్ 2బిగా వర్గీకరించిన రసాయనంతో సంబంధం ఉన్న కేన్సర్ ప్రమాదం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మనుషులు లేదా జంతువులపై చేపట్టిన అధ్యయనాల్లో పరిమిత స్థాయిలో ఆధారాలు లభించినప్పుడు ఇవి కేన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉండొచ్చని (పాసిబుల్) అని చెబుతారు. డీజిల్, నికెల్, కలబంద, ఆసియాలో కనిపించే ఊరగాయలు, కొన్ని రసాయనాలు ఈ వర్గంలోకి వస్తాయి.


మరోవైపు, డబ్ల్యూహెచ్ఓ ఆహార సంకలన సంయుక్త నిపుణుల కమిటీ జూన్ 27 నుంచి జూలై 6 వరకు జెనీవాలో జరిగిన సమావేశంలో అస్పార్టేమ్‌ సంబంధం ఉన్న నష్టాలను అంచనా వేసింది. ఇది మూల్యాంకనం చేసిన డేటా 1981లో నిర్దేశించిన ఆమోదయోగ్యమైన రోజువారీ పరిమాణం 0 నుంచి 40 మిల్లీగ్రాములను మార్చడానికి ఎటువంటి కారణాన్ని సూచించలేదని నిర్ధారించింది.


సాధారణంగా 200 లేదా 300 mg అస్పార్టేమ్ స్వీటెనర్‌ను కలిగి ఉండే శీతల పానీయాలను 70 కిలోల బరువున్న యువకుడు ADIని దాటాలంటే రోజుకు తొమ్మిది నుంచి 14 క్యాన్‌ల కంటే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, సమస్య అంతా అధిక వినియోగదారుల విషయంలోనే ఉందని బ్రాంకా చెప్పారు.


అస్పార్టేమ్ అనేది 1980ల నుంచి వివిధ ఆహార, పానీయాల ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగించే ఒక కృత్రిమ రసాయన స్వీటెనర్. ఇది డైట్ డ్రింక్స్, చూయింగ్ గమ్, జెలటిన్, ఐస్ క్రీం, పెరుగు వంటి పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, టూత్‌పేస్ట్, దగ్గు, చుక్కల మందులో దీనిని వినియోగిస్తారు. గ్రూప్ 2బి వర్గీకరణ అస్పార్టేను అలోవేరా, ఇతర కూరగాయల ఊరగాయల మాదిరిగానే ఉంచుతుందని ఇంటర్నేషనల్ స్వీటెనర్స్ అసోసియేషన్ తెలిపింది. ‘JECFA శాస్త్రీయంగా.. సమగ్రమైన సమీక్షను నిర్వహించిన తర్వాత అస్పార్టేమ్ భద్రతను మరోసారి ధ్రువీకరించింది’ అని ఐఎస్ఏ చీఫ్ ఫ్రాన్సిస్ హంట్-వుడ్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com