భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలకు వణుకుపుట్టిస్తున్నాయి. ఓ వైపు వర్షాలు కురుస్తుండటం.. మరోవైపు నదులు ఉప్పొంగుతుండటంతో భారీగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో జనం అవస్థలు పడుతున్నారు. అటు.. ఢిల్లీని ముంచెత్తిన యమునా నది కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మరోసారి అందులో వరద ప్రహవాం పెరుగుతోంది. దీంతో మరోసారి ఢిల్లీ వాసులను వరద ముప్పు వెంటాడుతోంది. ఇప్పటికీ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వరద గుప్పిట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లో గంగానది ఉగ్రరూపం దాల్చింది.
భారీ వర్షాల కారణంగా అలకనంద నదిపై ఉన్న జీవీకే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిండటంతో నీటిని కిందికి విడుదల చేశారు. దీంతో దేవ ప్రయాగ వద్ద గంగా నది ఉద్ధృతి ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. అటు.. హరిద్వార్‌లో గంగానది ప్రమాదకర స్థాయి 293 మీటర్లను దాటి పరవళ్లు తొక్కుతోంది. దీంతో గంగానది ఒడ్డున ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ఇప్పటికే వరద సహాయక శిబిరాలకు తరలించారు. మరోవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సోమవారం కూడా ఉత్తరాఖండ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హెచ్చరికలతో ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.ఇక ఢిల్లీలో ఇటీవల తగ్గుముఖం పట్టిన యమునా నది ప్రవాహం మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. యమునా నదిలో మళ్లీ వరద ఉప్పొంగుతోంది. ఇక నీటిమట్టం ఇంకా ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం 8 గంటలకు యమునా నదిలో నీటిమట్టం 205.50 మీటర్లు ఉండగా.. 9 గంటలకు 205.58 మీటర్లకు పెరిగింది. పై నుంచి భారీగా వరద రావడంతోపాటు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉండటంతో యమునా నదిలో ప్రవాహం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత ఢిల్లీ యమునా వంతెనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో వరద కొనసాగుతుండటంతో ఎర్రకోట, రాజ్‌ఘాట్ సహా వివిధ ప్రముఖ ప్రదేశాల్లో వరద నీరు అలాగే ఉంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడికి వెళ్లాల్సిన వేలాది ట్రక్కులు తమిళనాడులో నిలిచిపోయాయి. సజ్జలు, కొబ్బరికాయలు, స్టార్చ్, ఔషధాలలో ముడి పదార్థాలుగా ఉపయోగించే వస్తువులను తరలించే 75 వేలకుపైగా ట్రక్కులు తమిళనాడు వ్యాప్తంగా ఆగిపోయాయి. ఇదే క్రమంలో తమిళనాడుకు రావాల్సిన ఆపిల్స్, యంత్రాలు, టెక్స్‌టైల్ మెటీయల్స్ వంటి వస్తువులకు సంబంధించిన ట్రక్కులు అక్కడి నుంచి రావడం లేదని తమిళనాడు లారీ ఓనర్స్ ఫెడరేషన్ తెలిపింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి.. ప్రయాణానికి అనుకూలమైతేనే ట్రక్కులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.