పేదలకు మంచి జరిగించే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చిరు వ్యాపారుల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూసి జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సీఎం తెలిపారు. చిరు వ్యాపారులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకువచ్చామన్నారు. 5,10,412 మంది లబ్ధిదారులకు రూ. 560.73 కోట్ల లబ్ధి జరుగుతుందన్నారు. ఒక్కొక్కరికి రూ. 10 వేల నుంచి రూ. 13 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్తగా మరో 56 వేల మందికి జగనన్న తోడు అందిస్తున్నామని చెప్పారు. రూ. 11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కూడా విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ రూ. 2,955 కోట్ల వడ్డీ లేని రుణం అందించామని చెప్పారు. 4.54 లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి మళ్లీ రూ. 10 వేలు, ఆపై రుణాలుగా అందుకుంటున్నారన్నారు. సకాలంలో చెల్లించిన వారికి రూ. 13 వేల వరకూ వడ్డీ లేని రుణం ఇస్తున్నారని తెలిపారు. జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందిన వారిలో 80 శాతం అక్కా చెల్లెమ్మలే అని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గర్వంగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత కార్యక్రమం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు.