ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కోసం వాలంటీర్ వ్యవస్థని ప్రజలందరూ పసిగట్టారన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ప్రభుత్వానికి అక్కరకు లేని, పార్టీకి కావలసిన వ్యవస్థని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గుండెల మీద చేయి వేసుకొని సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్‌ని తమ పార్టీ నాయకులే రెచ్చగొట్టారని, పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారన్నారు. వాలంటీర్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తమ పార్టీ నాయకులు కొత్త రాగాన్ని అందుకున్నారన్నారు. వాలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవ ఏమిటి?, వాలంటీర్ వ్యవస్థ అన్నది అవసరమా? అని ప్రశ్నించారు. ప్రజలకు వాలంటీర్లు చేస్తున్న మేలు ఏమిటి?.. తమ పార్టీకి చేస్తున్న మేలు ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. ప్రతి కుటుంబం వివరాలను సేకరించి, వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల సర్పంచ్‌కు ఓటరుకు మధ్య సంబంధం లేకుండా పోయిందన్నారు. అలాగే ఎమ్మెల్యేకు ఓటర్‌కు మధ్య దూరం పెరిగిందన్నారు.
చెక్ యువర్ ఓటు.. గెట్ యువర్ ఓటు అనే ప్రచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితి లేదని.. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను ఓటరు జాబితా నుంచి అక్రమంగా తొలగిస్తున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన ఓటును తొలగించడం అనేది దారుణమని.. గుంటూరు నుంచి తనకు ఒక వ్యక్తి ఫోన్ చేసి వారి భార్యాభర్తల ఓటును ఓటరు జాబితా నుంచి తొలగించారని తనతో చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని తొలగించారని అని తెలిసిందని చెప్పారని అన్నారు. బూతు లెవల్ ఆఫీసర్‌తో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు సమన్వయం చేసుకొని.. ఓటరు జాబితాను పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లు లేకపోతే.. తిరిగి చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే విషయమై ఎన్నికల కమిషన్ అధికారులను కలుస్తానని.. ఇప్పటికే తాను పలుమార్లు లేఖలు రాశానన్నారు.
గతంలో డేటా చౌర్యంపై ప్రతిపక్ష నేతగా గొంతు చించుకున్న సీఎం జగన్.. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. గతంలో మహిళల ఫోన్ నెంబర్లు అడిగారని ఆవేదన వ్యక్తం చేసి.. ఇప్పుడు ఏకంగా ఫోటోలనే తీయిస్తున్నారని.. ఈ సమాచారాన్ని అంతా యూనికాన్ సంస్థ సేకరించి చేస్తున్న పని ఏమిటని ప్రశ్నించారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే వారి ఓటును ఓటరు జాబితా నుంచి తొలగించడమే కదా.. అనుకూలంగా లేని వారి ఓటును తొలగించి, ఎక్కడెక్కడ నుంచో వ్యక్తులను తీసుకువచ్చి దొంగ ఓట్లు చేర్పించడం ప్రజలందరికీ తెలుసున్నారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలోని తమ పార్టీకి అనుకూలంగా పనిచేసే కోవర్టుల ఆటలు సాగవన్నారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమన్న వార్తలు టీడీపీలోని కోవర్టులకు రుచించడం లేదని.. జనసేనతో పొత్తు పొసగకూడదని చంద్రబాబు చెవిలో ఏదో చెబుతున్నారన్నారు. అలాగే జనసేన లోని కోవర్టులు కూడా పవన్ కళ్యాణ్ చెవిలో కూడా ఏదో చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నారన్నారు. బీజేపీలో తమ పార్టీకి అనుకూలంగా ఉండే నాయకులు, రానున్న ఎన్నికల్లో తాము జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ కూడా తాము బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెప్పడం లేదని అన్నారు. ఎవరెన్ని విధాలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఏమార్చాలని చూసినా వారి పప్పులు ఉడకవన్నారు. టీడీపీ జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంత వరకు మరొక ప్రకటన చేసింది లేదన్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమన్నారు.
ఒకవైపు సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతుంటే.. యువ గళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్.. వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి నిర్భయంగా వెళుతున్నారన్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు వారికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లను పెట్టి, చలి మంటలు కాచుకునే దుర్మార్గానికి తెరలేపారని.. నరసరావుపేటలో కులాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లా రాజాంలో గతంలో తెలుగుదేశం పార్టీ తరపున సర్పంచ్ గా ఎన్నికైన మాస్టర్‌ను దారుణంగా అధికార పార్టీ నాయకులు హత్య చేశారన్నారు.