ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు ఆగవని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా సంక్షేమాన్ని పట్టించుకోని తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని భవానీ నగర్, జనశక్తి నగర్, శారదానగర్‌లలో ‘జగనన్న సురక్ష’ క్యాంపులు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి లబ్ధిదారులకు ఉచితంగా ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ..వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నామన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ నాడు నేడు కింద వాటి రూపురేఖలు మార్చివేస్తున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలో రూ. 3 లక్షల కోట్లను సంక్షేమానికి వెచ్చించామని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండగా సంక్షేమాన్ని పట్టించుకోలేదని, నేడు సీఎం వైయస్ జగన్ చేస్తుంటే ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.