అక్కడ ఒక పెళ్లి జరుగుతోంది. వధూవరులు, ఇరు వర్గాల బంధువులు, వివాహనికి వచ్చిన అతిథులతో ఆ పెళ్లి మండపం సందడిగా ఉంది. ఇంతలో పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి అక్కడికి ఏనుగుల గుంపు వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తోచక ఎక్కడి వారు అక్కడే పరారయ్యారు. చివరికు గజరాజుల రాకతో పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జోవాల్ భంగా గ్రామంలో ఆదివారం తన్మోయ్ సింఘా, మంపి సింఘాలకు పెళ్లి జరుగుతోంది. వివాహ తంతు పూర్తయి.. బంధువులు, అతిథులు అంతా భోజనాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పెళ్లి విందులో రొయ్యలు, ఉలవచారు, బంగాళాదుంప కుర్మా సహా వివిధ వంటకాలను తయారు చేశారు. దీంతో ఈ వాసనలు పసిగట్టిన ఏనుగులు.. జోవాల్ భంగా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి పెళ్లి మండపానికి వచ్చాయి. దీంతో అక్కడ ఆ గజరాజులు అల్లకల్లోలం సృష్టించాయి. పెళ్లిలో అన్ని సామాన్లను ధ్వంసం చేశాయి. దీంతో అక్కడ ఉన్న వారంతా తీవ్ర భయాందోళనతో పరుగులు పెట్టారు. అక్కడ ఉన్న ఇళ్లలోకి దూరి.. తలుపులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి పీటల మీద ఉన్న వధూవరులు కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. పెళ్లికి వచ్చిన వారి బైక్ తీసుకుని పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె.. పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు.
అయితే అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి అటవీ జంతువులు వస్తుంటాయని గ్రామస్థులు వెల్లడించారు. అడవుల్లో తినడానికి ఏమీ దొరక్క ఇలా గ్రామాలపై పడి.. ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఏనుగులు గ్రామాల్లోకి రావడం ఎక్కువ అయిందని వాపోయారు. ఏనుగులు తరచూ ఊర్లలోకి వస్తుండటంతో గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి పండగలు, కార్యక్రమాలు, పెళ్లిళ్లు నిర్వహించడం లేదని తెలిపారు. ఇటీవల బెంగాల్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరిగినా.. అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో పార్టీలకు చెందిన నేతలు గుట్టుగా బిక్కుబిక్కుమంటూ ప్రచారాన్ని నిర్వహించారు. ఎక్కడైనా విందు భోజనం వాసన వస్తే చాలు.. ఏనుగుల గుంపు వచ్చి.. అక్కడ సామాగ్రిని ధ్వంసం చేసి.. ఆహారాన్ని తింటున్నాయని గ్రామస్థులు వెల్లడించారు. ప్రభుత్వం, అటవీ అధికారులు చొరవ తీసుకుని.. ఏనుగుల గుంపు గ్రామాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.