వ్యాపారులు సీజన్‌కు తగ్గట్టు తమ బిజినెస్ ఐడియాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను హైలైట్ చేస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తూ తమ బిజినెన్‌ను పెంచుకుంటూ ఉంటారు. తాజాగా దేశంలో టమాటా రేట్లు ఆకాశాన్ని అంటాయి. కిలో టమాటా రూ. 150 నుంచి రూ. 200 మధ్య పలుకుతోంది. దీంతో పేదలు, సామాన్యులు టమాటా కొనాలంటేనే జంకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ టమాటా ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో టమాటా రేట్లపై జోరుగా మీమ్స్, ట్రోల్స్, కామెంట్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు.
పంజాబ్ చండీగఢ్‌కు చెందిన అరుణ్ అనే ఆటో డ్రైవర్.. ప్రయాణికులను ఆకర్షించేందుకు టమాటాలను అస్త్రంగా ఎంచుకున్నాడు. తన ఆటోలో ప్రయాణించినవారికి కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు. అదేంటీ ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఉచితంగా ఇవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా. ఇక్కడే ఉంది అసలైన ట్విస్టు. కిలో టమాటాలు ఫ్రీగా ఇవ్వడానికి ఒక కండీషన్ కూడా పెట్టాడు ఆ ఆటో డ్రైవర్. ఎవరైతే తన ఆటోలో కనీసం ఐదుసార్లు ప్రయాణిస్తారో వారికి మాత్రమే కిలో టమాటాలను ఉచితంగా ఇస్తానని తెలిపాడు.
గత 12 ఏళ్లుగా అరుణ్ ఆటోను నడుపుతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరగడంతో సామాన్యులకు తన వంతు సాయం చేయడంతోపాటు తన ఆటోలో ఎక్కే ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవాలని భావించాడు. దీంతో తన ఆటోలో ఐదుసార్లు ప్రయాణించిన వారికి కిలో టమాటాలు ఉచితంగా ఇస్తానని తన ఆటో వెనకాల ఓ పోస్టర్‌ను కూడా అంటించాడు. దీంతో ఈ విషయం కాస్త వైరల్‌గా మారింది. తనకు ఉన్న ఒకే ఒక ఆదాయమార్గం ఆటోనే అని అరుణ్ చెప్పాడు. అలాంటి ఆటో ద్వారా సామాన్యులకు ఇలాంటి సేవలు అందించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు.
మరోవైపు.. త్వరలో క్రికెట్ ప్రపంచకప్ రానున్న నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని కోరుకున్నాడు. అలా భారత్ గెలిస్తే.. చండీగఢ్‌లో ఐదు రోజులపాటు తన ఆటోలో ఎక్కిన వారికి ఉచిత ప్రయాణం అందిస్తానని వెల్లడించాడు. గతంలోనూ అరుణ్ ఇలా ఉచిత ప్రయాణాలు కల్పించాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సమయంలోనూ కొన్ని రోజులు అరుణ్ చండీగఢ్‌లో ఉచితంగా ఆటోను నడిపాడు. దీంతో పాటు.. అరుణ్ తన ఆటోలో గర్భిణీలు, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత ప్రయాణం అందిస్తాడు. ఇందుకు గానూ చండీగఢ్ పోలీసుల నుంచి సత్కారం కూడా అందుకున్నాడు. అరుణ్ తన ఆటోలో భారత సైనికులను చండీగఢ్‌లో ఉచితంగా ఎక్కడికైనా తీసుకువెళ్తాడు.