పబ్‌జీలో పరిచయమైన ఉత్తర్ ప్రదేశ్ యువకుడు సచిన్ మీనా కోసం తన నలుగురు పిల్లలతో భారత్‌కు వచ్చేసిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఆమె పాకిస్థాన్ ఏజెంటని, సచిన్ మీనా దగ్గరకు రావడానికి ముందు ఢిల్లీలో కొందర్ని కలిసిందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీమా హైదర్‌కి పాకిస్థాన్ సైన్యంతో సంబంధం ఉందని తాజాగా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సీమా భర్త గులామ్ హైదర్ ఓ భారతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
సీమా హైదర్ సోదరుడు ఆసిఫ్ పాకిస్థాన్ సైన్యంలో పనిచేస్తున్నాడని చెప్పాడు. ఆమె బాబాయ్ గులామ్ అక్బర్ పాక్ సైన్యంలో ఉన్నతస్థాయి అధికారిగా ఉన్నాడని తెలిపాడు. అసిఫ్ కరాచీలో పనిచేస్తున్న సమయంలో తనను నేను కలుసుకున్నానని సీమా భర్త వెల్లడించాడు. అయితే, అతడు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నాడా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పాడు. అలాగే, ఆమె బంధువు ఇస్లామాబాద్‌లోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారిగా పనిచేస్తున్నట్టు గులామ్ వివరించాడు.
ఇక, సీమా హైదర్‌తోపాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్ మీనా, అతడి తండ్రి ప్రస్తుతం యూపీ ఏటీఎస్ అధికారులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అదుపులో ఉన్నారు. ఆమెకు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సీమా వద్ద ఉన్న పాకిస్థాన్ గుర్తింపు కార్డుపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. వాటితోపాటు ఆమె పాస్‌పోర్ట్, ఇతర ధ్రువపత్రాలు, పిల్లల వివరాలకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.