గార్డెన్ సిటీలో పేలుళ్లకు ఉగ్రవాదులు చేసిన కుట్రను బెంగళూరు పోలీసులు భగ్నం చేశారు. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో భారీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు పసిగట్టిన నిఘా వర్గాలు.. పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి.. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రకు సంబంధించి మరో ఐదుగురు అనుమానితుల కోసం లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు అధికారులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని సీసీబీ (CCB)కి సమాచారం అందింది. ఈ క్రమంలో అరెస్టులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులకు 2017లో జరిగిన ఓ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆ కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, పేలుడు పదార్థాల వాడకంలో శిక్షణ పొందారని తెలిపాయి. ఐదుగురు నిందితులను సయ్యద్ సుహేల్, ఉమర్, జునైద్, ముదాసిర్, జహిద్‌గా గుర్తించినట్టు సీసీబీ అధికారులు పేర్కొన్నారు.
అనుమానిత ఉగ్రవాదులకు జమాతే ఇస్లామీతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అనుమానిత ఉగ్రవాదులు బెంగళూరులోని వివిధ ప్రాంతాలకు చెందినవారని చెప్పారు. నిందితుల నుంచి బాంబుల తయారీకి ఉపయోగించే సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ సంక్షిప్తంగా వివరాలను వెల్లడించారు. అనుమానితులకు గతంలో ఓ హత్య కేసుతో సంబంధం ఉందన్నారు. ఉగ్ర కుట్రలో మొత్తం 10 మంది ఉన్నారని, వీరిలో ఐదుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. బెంగళూరులో పేలుళ్లకు వ్యూహరచన చేసినట్టు విచారణలో వెల్లడించారు. వారి వద్ద వాకీటాకీలు, డాగర్లు, పిస్టోళ్లు లభించాయని సీపీ అన్నారు. ఈ కుట్ర వెనుక పరప్పన అగ్రహారం సెంట్రల్ జైళ్లో ఉన్న ఉగ్రవాది నజీర్ హస్తం ఉందని, అతడే వీరికి శిక్షణ ఇచ్చాడని తెలిపారు.