ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కానీ అక్కడికి వెళ్లాలంటే పాక్ వీసా తప్పనిసరి

national |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 09:07 PM

సాధారణంగా ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టులు, వీసాలు అవసరం అవుతాయి. అయితే ఆ దేశం పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా ఇతర దేశాల పాస్‌పోర్టులు అవసరం లేదు. ఇందులో కొత్త ఏముంది ఇది సాధారణ విషయమే అని అనుకుంటున్నారా. మన దేశంలోని ఒక ప్రాంతానికి వెళ్లాలంటే మాత్రం పాకిస్థాన్ వీసా కావాలి. దీంతో పాటు భారత పాస్‌పోర్టు కూడా అవసరం ఉంటుంది. భౌగోళికంగా ఆ ప్రాంతం భారత్‌లోనే ఉన్నా.. భారతీయులు అక్కడి వెళ్లాలంటే మాత్రం పాస్‌పోర్టుతోపాటు పాక్ వీసా కూడా ఉండాల్సిందే. ఇదే అట్టారీ రైల్వే స్టేషన్.


ఈ అట్టారీ రైల్వే స్టేషన్ భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్‌ను అట్టారి శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది భారత్, పాక్‌ సరిహద్దుల్లో ఉన్న అత్యంత సున్నితమైన ప్రదేశం. పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో ఈ అట్టారి రైల్వే స్టేషన్ ఉంది. అయితే భారత్, పాక్ సరిహద్దుల్లోని అట్టారి - వాఘా బోర్డర్ ప్రాంతంలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. అట్టారి భారత్‌లోని ప్రాంతం కాగా.. వాఘా అనేది పాకిస్థాన్‌కు చెందిన భూభాగం. అందుకే ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలంటే పాకిస్థాన్ వీసా తప్పనిసరి చేశారు.


గత కొన్ని సంవత్సరాలుగా భారత్, పాకిస్థాన్ మధ్య శాంతియుత సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో సరిహద్దుల్లో సైన్యం భారీగా మోహరించి.. గస్తీని పెంచింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య జరిగే రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే భారత్ - పాక్ మధ్య నడిచే ఒకే ఒక రైలు అయిన సంజౌతా ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు అయింది. దీంతో రెండు దేశాల మధ్య రాకపోకలు కూడా తగ్గిపోయాయి.


ఈ సంజౌతా ఎక్స్‌ప్రెస్ నడిచే మార్గంలో ఉన్న ఈ అట్టారి రైల్వే స్టేషన్ దేశంలోనే చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. భూభాగం పరంగా ఈ అట్టారి స్టేషన్ భారత్‌లోనే ఉన్నా.. ఇక్కడివారు ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే మాత్రం పాస్‌పోర్టుతో పాటు పాకిస్థాన్ వీసా కూడా కలిగి ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ అట్టారి రైల్వే స్టేషన్ భారత్‌ నుంచి ఎగ్జిట్ పాయింట్ కాగా.. పాకిస్థాన్‌ లోకి ఎంట్రీ పాయింట్. ఈ నేపథ్యంలోనే ఈ అట్టారి రైల్వే స్టేషన్‌లో పటిష్ఠమైన భద్రత ఉంటుంది. ప్రయాణికులకు రెండు మూడు అంచెల్లో తనిఖీలు చేసి.. ఇక్కడ రైలు ఎక్కేందుకు అధికారులు అనుమతిస్తారు. ఈ అట్టారి రైల్వే స్టేషన్ నార్తర్న్ రైల్వే జోన్‌లో ఉండగా.. ఈ స్టేషన్ నిర్వహణను ఫిరోజ్‌పూర్ డివిజన్ పర్యవేక్షిస్తుంటుంది.


ఈ అట్టారి - వాఘా సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన సైన్యం మోహరించి ఉంటుంది. ఇక్కడ ఏటా స్వాతంత్ర దినోత్సవానికి ఇరు దేశాల సైన్యం.. మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటాయి. ఎవరైనా భారతీయులు పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లినా.. పాక్ వాసులు భారత భూభాగంలోకి వెళ్లినా.. ఈ అట్టారి వాఘా సరిహద్దుల గుండానే ఎవరి దేశానికి వారిని పంపిస్తారు. ఈ అట్టారి వాఘా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు నిరంతరం గస్తీ కాస్తూనే ఉంటారు.


అట్టారి రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం గతేడాది ట్విటర్‌లో వెల్లడించింది. అమృత్‌ మహోత్సవ్ ట్విటర్ ఖాతా నుంచి అట్టారి స్టేషన్‌కు విశేషాలను తెలిపింది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని.. ఎంతో వైవిధ్యాన్ని కలిగి ఉందని చెప్పడానికి ఈ అట్టారి స్టేషన్ నిదర్శనమని పేర్కొంది. ఇదే సమయంలో అట్టారి స్టేషన్‌కు చేరుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీసా, పాస్‌పోర్టు ఉండాలని తేల్చి చెప్పింది. ఎవరైనా ఈ వీసా, పాస్‌పోర్టు లేకుండా అక్కడికి వెళ్తే అధికారులు పట్టుకుని చర్యలు తీసుకుంటారని తెలిపింది. పాస్‌పోర్ట్, వీసా లేని ప్రయాణికులను అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com