వ్యాపారస్తులు.. తమ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకునేందుకు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొంత మంది బిజినెస్‌మేన్‌లు కస్టమర్లను ఆకర్షిస్తారు. మరికొంత మంది తమ వ్యాపారాన్ని, ఉత్పత్తులను వినూత్నంగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. ఇందు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తారు. అయితే ఓ దాబా పరోటా ఛాలెంజ్‌ను ప్రకటించింది. ఆ పరోటాను తిన్న వారికి రూ. లక్ష చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో ఫుడ్ లవర్స్.. ఎలాగైనా ఆ పరోటాను తిని రూ. లక్ష గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ దాబా హర్యానా రాష్ట్రంలో ఉంది. ఈ దాబా పేరు రాయల్ హోషియార్‌పూర్ దాబా. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద పరోటాను తయారు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు దేశంలో చాలా రకాల పరోటా ఛాలెంజ్‌లు విసిరిన హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే వాటన్నింటి కంటే తాము తయారు చేసే పరోటా అతి పెద్దది అని హోటల్ యజమాని స్పష్టం చేశాడు. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భోజన ప్రియులు తమ దాబాకు వచ్చి ఈ పెద్ద పరోటాను తిని నగదు బహుమతి గెలుచుకోవాలని దాబా యజమాని సూచిస్తున్నాడు.
ఈ దేశంలోనే అతిపెద్ద పరోటాను ఎలా తయారు చేస్తున్నారో రాయల్ హోషియార్‌పూర్ దాబా యజమాని వెల్లడించారు. ఈ పరోటా తయారీకి 2 కిలోల పిండి.. 600 నుంచి 700 గ్రాముల ఉల్లిపాయలు లేదా బంగాళాదుంపలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ పరోటాల తయారీలో స్వచ్ఛమైన దేశీయ నెయ్యిని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రాయల్ దాబాలో మొత్తం మూడు రకాల పరోటాలను తయారు చేస్తున్నట్లు వివరించాడు. ఈ పరోటాను ఆ రాయల్ దాబాలో ఉన్న సోహన్‌లాల్ అనే చెఫ్ తయారు చేస్తున్నాడు. దాన్ని తయారు చేయడానికి మరో ముగ్గురు సహాయకలు సోహన్‌లాల్‌కు సహాయ పడుతున్నారు.
ఈ భారీ పరోటాను తినేందుకు కస్టమర్లు, భోజన ప్రియులకు దాబా యాజమాన్యం ఛాలెంజ్ విసిరింది. అయితే ఇందుకు కొన్ని షరతులను కూడా పెట్టారు. ఈ పరోటాను ఇష్టం ఉన్నంతసేపు కూర్చొని తినేందుకు వీలు లేదని దాబా యజమాని స్పష్టం చేశాడు.
పరోటా ఛాలెంజ్‌లో భాగంగా మొత్తం పరోటాను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేయాలని తెలిపింది. అలా పూర్తి చేసిన వారికి వెంటనే రూ. లక్ష నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించింది. అయితే ఈ పరోటా ఛాలెంజ్ విసిరి 4 ఏళ్లు పూర్తి అయిందని దాబా యజమాని వెల్లడించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ ఈ పరోటా ఛాలెంజ్‌ను పూర్తి చేయలేక పోయారని తెలిపారు.