ప్రకాశం జిల్లాలో ఓ మహిళా ఎస్సై పోలీసులకు దొరికిపోయారు. భార్యాభర్తల మధ్య గొడవ కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కొనకనమిట్ల మండలం కాట్రకుంటకు చెందిన చెన్నకేశవులు, అంజలి భార్యాభర్తలు. మే నెలలో గొడవల కారణంగా వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగిది. చెన్నకేశవులు కోపంతో భార్య అంజలిపై దాడి చేయడంతో తలకు గాయమైంది. బాధితురాలి ఫిర్యాదుతో చెన్నకేశవులుతో పాటు అతని తరఫు మరో ఇద్దరు బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నకేశవులును కోర్టులో హాజరుపరచగా.. బెయిల్‌పై విడుదలయ్యారు.
అయితే ఈ కేసులో మిగిలిన ఇద్దరి పేర్లు తొలగించేందుకు రూ.45 వేలు ఇవ్వాలని ఎస్సై దీపిక, కానిస్టేబుల్ నరసింహులు బేరం పెట్టారు. ఆ వెంటనే చెన్నకేశవులుతో పాటు అతని బంధువులు ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. పొదిలి కొనకనమిట్ల జంక్షన్ సమీపంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సై, కానిస్టేబుల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిపై కేసు నమోదు చేసి ఏసీబీ నెల్లూరు జిల్లా ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు.
కొనకనమిట్ల ఎస్‌ఐ దీపిక ఏసీబీకి దొరికారనే విషయాన్ని ఎస్పీ మలిక గర్గ్ దృష్టికి తీసుకెళ్లగా.. అవినీతికి పాల్పడితే ఎవరైనా ఒకటే అన్నారు. పోలీస్‌స్టేషన్‌లలో డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని.. అ లాంటి వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. పోలీస్‌శాఖలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
అవినీతి అధికారులపై ప్రజల ఫిర్యాదు కోసం 14400 నంబర్‌ను అందబాటులోకి తీసుకొచ్చారు. ఏసీబీ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి కోరారు. ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు