కూలిపనులు చేసుకుంటూ పీహెచ్‌డీ పట్టా అందుకున్న డాక్టర్ సాకే భారతి కష్టాల గురించి తెలుసుకుని ఎంతోమంది అండగా నిలిచారు. భారతి ఇంటికి మీడియా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే నాగులగుడ్డం లో సందడి వాతావరణం కనిపించింది. శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బండారు శ్రావణిశ్రీ భారతిని సన్మానించి రూ. 15 వేలు అందించారు.
మరోవైపు అమ్మ సంస్థ వ్యవస్థాపకుడు రమణారెడ్డి రూ.20 వేలు, నిత్యావసరాలు, దుస్తులు అందించారు. రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్ హరిత, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు భారతిని సన్మానించారు. అనంతపురం మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న రూ.10 వేలు నగదు అందించి సన్మానించారు. పలువురు ఆమెను సత్కరించి డాక్టరేట్ సాధనకు చేసిన కృషిని ప్రశంసించారు.
సాకే భారతి తల్లిదండ్రుల కష్టాలను చూసి.. చిన్న తనంలో ఆమె తాత తన ఇంటికి తీసుకొచ్చి చదివించారు. అక్కడే పదవ తరగతి వరకు చదువుకుంది.. వృద్దాప్యం మీద పడటంతో భారతి తాతకు ఆమె చదివించడం భారంగా మారింది. ఆమెను నాగులగుడ్డంకు చెందిన మేనమామ శివప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. దీంతో ఆమె చదువు ఆగిపోయింది.. అయితే కొంతకాలానికి భారతి మనసులో మాటను భర్త శివప్రసాద్ తెలుసుకున్నారు. ఆ తర్వాత భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు చదివారు. కూలి పనులు చేసుకుంటూనే.. అప్పటికే కూతురు గాయత్రి ఆలనా పాలనా చూసుకుంటూనే చదువును కొనసాగించారు. పీజీ తర్వాత ఏం చేయాలనే ప్రశ్న మొదలైంది.. అప్పుడు ఆమె భర్త, లెక్చరర్లు పీహెచ్‌డీ దిశగా ఆలోచించమన్నారు.
పీజీ తర్వాత పీహెచ్‌డీ కోసం పరీక్ష రాశారు.. ఆ ప్రయత్నంలో ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఆమెకు ఉపకార వేతనం భారతికి కొంతమేర సాయపడింది. ఇలా ఎన్నో కష్టాలను భరించి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. పీహెచ్‌డీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో 'నీ మొహానికి అవసరమా' అంటూ ఎంతోమంది అవమానించారని చెప్పుకొచ్చింది భారతి. అలా తనను అవమానించినవారి నోర్లు కూడా మూయించేలా కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు.
పీహెచ్‌డీ పట్టా అందుకున్న భారతి జీవితం అంతా కష్టాలమయం. రోజూ కూలి పనికి వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి.. అటు భర్త, ఇటు తను పనులు చేసుకుంటూ వచ్చే డబ్బులతోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆమెకు ఉండటానికి కూడా సరైన ఇల్లు లేదు.. ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు మొరపెట్టుకున్నా సరే స్పందించ లేదని భారతి భర్త శివప్రసాద్ అంటున్నారు. ప్రభుత్వం ఈ కుటుంబానికి సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.