తిరుమల శ్రీవారికి భక్తులు విలువైన కానుకలు అందజేస్తుంటారు. ఈ క్రమంలోన ఓ భక్తుడు బ్యాటరీ వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి టీటీడీకి రూ.4.5 లక్షల విలువైన బ్యాటరీతో నడిచే వాహనాన్ని ( బగ్గీ) విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించిన అనంతరం తిరుమల డిఐ శ్రీ జానకిరామిరెడ్డికి దాత బ్యాటరీ వాహనం అందజేశారు. తిరుమల శ్రీవారికి భక్తులు డబ్బులు, బంగారం, వెండితో పాటుగా వాహనాలను కూడా కానుకలుగా అందజేస్తుంటారు. ఇటీవల ఇద్దరు భక్తులు స్వామివరికి కార్లను విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. టికెట్లను ముందే బుక్ చేసుకున్న భక్తులకు మాత్రం1 దర్శనం కాస్త త్వరగా అవుతోంది. బుధవారం 74,024 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 32688 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో ఎంఓయులు చేసుకుని వారి వద్ద ఉన్న తాళపత్రాలను డిజిటైజ్ చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు.శ్రీ వేంకటేశ్వర మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్ట్ ప్రగతిపై ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో గురువారం ఆయన సమీక్ష జరిపారు. ఇప్పటిదాకా డిజిటైజ్ చేసిన తాళపత్రాల్లో సమాజానికి ఉపయోగ పడే అంశాలున్న వాటిని పుస్తక రూపంలో తేవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైనంత మంది స్కాలర్స్ ను నియమించుకోవాలని సూచించారు. గత రెండు నెలలతో పోల్చితే ప్రాజెక్ట్ ప్రగతి బాగుందని అన్నారు.
సనాతన జీవన ట్రస్ట్ కు చెందిన శ్రీ శశిధర్ ను సంప్రదించి ఆయన విరాళంగా అందిస్తానని చెప్పిన తాళపత్రాల స్కానర్ ను త్వరగా తెప్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు . తాళ పత్రాల సేకరణకు సంబంధించిన ఆరు నెలల ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా పని చేయాలన్నారు. తాళపత్రాల్లో మిస్ అయిన అక్షరాలను పొందుపరచగలిగే సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేసుకోవడానికి సంబంధిత వ్యక్తులతో చర్చించాలని ఈవో సూచించారు. ప్రస్తుతం ఉన్న తాళపత్ర బండిల్స్ లో మిగిలిన సుమారు వెయ్యి బండిల్స్ ను రాబోయే మూడు నెలల్లో స్కానింగ్ పూర్తి చేయాలని ఈవో చెప్పారు.