మణిపూర్ హింసాకాండ పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. దాదాపు మూడు నెలలుగా మణిపూర్ అట్టుడికిపోతుంటే ప్రధాని కనీసం మాట్లాడటం లేదని, ఈ అంశంపై మోదీ తక్షణమే సమాధానం ఇవ్వాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. వర్షాకాల సమావేశాల్లో వరుసగా మూడో రోజైన సోమవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. వాయిదాల తర్వాత పదే పదే విపక్ష ఎంపీలు సభను అడ్డుకోవడంతో గందరగోళం నెలకుంది. ఇదే సమయంలో విపక్ష ఎంపీలు సోమవారం రాత్రి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కొనసాగించారు.
మణిపూర్‌లో జరుగుతోన్న అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ పార్లమెంట్ ఆవరణలో రాత్రి ఆందోళన చేపట్టింది. ‘మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు, బ్యానర్‌లు చేతపట్టుకుని ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేశారు. ఆప్, కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు. రాత్రంతా తమ ఆందోళనను కొనసాగించారు.
అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై ఉభయ సభల్లోనూ ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలన్న విపక్ష కూటమి ఇండియా డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మూడో రోజైన సోమవారం కూడా సమావేశాలు సజావుగా సాగలేదని పేర్కొంది. కాగా, మణిపూర్ ఘటనలపై చర్చించాలని లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ డిమాండ్ చేశారు.
ఆయనకు మద్దతుగా విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అయితే కేంద్రం తరఫున ఎవరూ సమాధానం ఇవ్వాలనేది మీరు ఆదేశించలేరని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు సరికదా.. స్వరం మరింత పెంచి నినాదాలు చేశారు.
‘ఇండియా ఫర్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీలు కూడా ఎదురుదాడికి దిగారు. పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌లలో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్నింటికంటే ముఖ్యమైన అంశంపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ప్రతిపక్షం కూడా ప్రభుత్వంపై అదే ఆరోపణలు చేసింది.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ప్రభుత్వం అసభ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘ప్రధాని సభకు వచ్చి ప్రకటన చేయాలన్నదే మా డిమాండ్. ఆ ప్రకటనపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. మీరు బయట మాట్లాడుతున్నారు కానీ లోపల కాదు, ఇది పార్లమెంటును అవమానించడమే. ఇది తీవ్రమైన విషయం’ అని ఆయన అన్నారు.
మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో మహిళలపై హింసకు సంబంధించిన సమస్యలపై ప్రతిపక్ష నాయకులు మౌనంగా ఉన్నారని, చర్చ నుంచి పారిపోయారని బీజేపీ నేత సుధాన్షు త్రివేది ఆరోపించారు.