ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసి వాటితో జల్సాలు చేసేందుకు ఓ మహిళ కుమార్తెను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ఈ క్రమంలోనే ఆమె కూతురు 43 సార్లు ఆస్పత్రిలో చేరింది. తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాలికను ఆస్పత్రిలో చేర్పిస్తానని చెప్పి.. అటు ఆమె పనిచేసే ఆఫీస్‌లో కూడా చాలా సెలవులు పెట్టింది. ఈ ఘటన జపాన్‌లో చోటు చేసుకుంది.
ఒసాక ప్రిఫెక్షర్‌లో ఈ ఘటన జరిగింది. ఇన్సూరెన్స్ కోసం తన కుమార్తెను కసుమి నవట అనే మహిళ పదే పదే ఆస్పత్రికి తరలించింది. దాని కోసం బాలికను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. చిన్నారికి తిండి పెట్టకపోవడం, అనారోగ్యం లేకపోయినా వివిధ రకాల మందులు మింగించింది. దీంతో ఆ చిన్నారి తరచూ తీవ్ర అస్వస్థతకు గురయ్యేది. దీంతో ఆస్పత్రికి తరలించి.. ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ చేసుకునేది. 2018 సంవత్సరం నుంచి కసుమి నవట.. తన కుమార్తెను 43 సార్లు ఆస్పత్రిలో చేర్పించిందని దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 5.7 మిలియన్ యెన్‌లు అంటే సుమారు రూ. 33 లక్షలు క్లెయిమ్ చేసింది.
అయితే కసుమి నవట ప్రవర్తనపై ఆస్పత్రి వర్గాలకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. కసుమి నవట.. ఒక పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేది. కుమార్తెకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిన ఆమె.. చిన్నారిని తరచూ ఆస్పత్రిలో చేర్పించేది. చిన్నారికి తిండి పెట్టకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేది. కొన్ని కొన్ని సార్లు విరోచనాల మందులను కూడా బలవంతంగా వేయించేంది. దీంతో ఆ చిన్నారికి కెటోటిక్ హైపోగ్లైసీమియా అనే వ్యాధి సోకింది. ఫలితంగా ఆమె రక్తంలో షుగర్ లెవెల్స్, మూత్రంలో కీటోన్లు పడిపోయాయి. అయితే ఇన్సూరెన్స్ డబ్బు రాగానే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి టూర్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి మెసేజ్‌లను కూడా ఆమె సెల్‌ఫోన్‌లో గుర్తించారు. ఆమె తరచుగా స్నేహితులతో కలిసి తరచూ జల్సాలకు వెళ్లేదని విచారణలో తేలింది.
తన కుమార్తెకు దీర్ఘకాల అనారోగ్యం అని చెప్పి పాఠశాల యాజమాన్యానికి తరచూ చెప్పి సెలవులు పెట్టించేది. ఇలా 2018 నుంచి ఇప్పటి వరకు 43 సార్లు కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అందులో 39 సార్లు ఒకే ఆస్పత్రికి తరలించింది. ఇందులో భాగంగా 332 రోజులు ఆస్పత్రిలోనే ఉంచింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ కింద.. 3 ఇన్సూరెన్స్ సంస్థల నుంచి సుమారు రూ.33 లక్షలు క్లెయిమ్ చేసుకుంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు.. మార్చి నుంచి జూన్ మధ్య కసుమి నవటను 3 సార్లు అరెస్టు చేశారు. చిన్నారి ప్రాణానికి హాని చేస్తోందంటూ కోర్టు కూడా గుర్తించింది. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆమెను బలమైన ఆధారాలతో అరెస్టు చేశారు.