రెండు వారాలుగా ఉత్తరాదిని వణికించిన వరుణుడు.. ప్రస్తుత దక్షిణ భారతంవైపు మళ్లాడు. గత మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండగా... అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయనే వాతావరణ శాఖ అంచనాలతో తెలంగాణలోని విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. తాజాగా, కర్ణాటక, తెలంగాణ, కేరళలోని పలు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కర్ణాటకలోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రదేశాలకు వెళ్లొదని ఐఎండీ సూచించింది. అలాగే, శిథిలావస్థలో ఉన్న కట్టడాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు చిక్కమగళూరు జిల్లా ముళ్లయ్యనగిరికి వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. కృష్ణ, ఘటప్రభ, మలప్రభ, వేద్‌గంగ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. బెళగావి, ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో వంతెలు, రహదారులు జలమయమయ్యాయి. మరోవైపు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలతో ఆలమట్టి, తుంగభద్రకు వరద పోటెత్తుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరు ఎడతెగని వానలతో నగరం చల్లగా మారిపోయింది. మంగళవారం సాయంత్రం నుంచి వర్షం తీవ్రత మరింత పెరిగింది. చెట్ల కొమ్మలు విరిగి పడి పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వర్షం నీరు నిలవకుండా నగరపాలక సిబ్బంది ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు వాననీటి కాలువల ద్వారా రాచకాలువలోకి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఇక, వాయవ్య బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం.. మంగళవారం అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారింది. బుధవారం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఉత్తర ఆంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.