తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కమిషనర్ ఛాంబర్‌లో నిరసన కొనసాగిస్తున్నారు. మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్‌లు పలు భవనాలను అసంపూర్తిగా నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ముందు ఐదో రోజు నిరసనకు దిగారు.
అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదన్నారు. కమీషనర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు నిరసన కొనసాగిస్తాను అన్నారు. రాత్రి కమీషనర్ చాంబర్ ముందే నిద్రించి ఉదయం మున్సిపల్ కార్యాలయంలోనే బ్రష్ వేసి స్నానం చేశారు. మున్సిపల్ కార్యాలయానికి రాకుండా ఎమ్మెల్యే కార్యక్రమంలో కమీషనర్ ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు జేసీ. తాడిపత్రి ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకం కోసం ఎంతవరకైనా పోరాడుతాను అంటున్నారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
ప్రొటోకాల్, మున్సిపల్ నిబంధనలు పాటించకుండా పట్టణ ఆరోగ్య కేంద్రం, మాంసం మార్కెట్‌ను ప్రారంభించారని విమర్శించారు. భవన నిర్మాణాల్లో వారి అక్రమాలు బయటపడతాయని పిలవలేదని.. మాంసం మార్కెట్, పట్టణ ఆరోగ్యకేంద్రం గురించి అధికారులు సమాధానం చెప్పాలన్నారు. వీటిపై మున్సిపల్ అధికారులు సరైన సమాధానం అందించే వరకు ఇక్కడే వంటావార్పు, రాత్రి నిద్రతో నిరసన కొనసాగిస్తామన్నారు. అయితే నిరసన కార్యక్రమాలతో విధులకు ఆటంకం కలుగుతోందని మున్సిపల్ కమిషనర్ రవి స్థానిక డీఎస్పీకి కలిసి వివరించినట్లు తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో గతంలో కూడా నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.