రహదారుల మీద నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంత మంది ఇంజినీరింగ్ విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు కాలేజీకి వెళ్లాల్సి ఉంది. మరెలా? సాయం చేయండి సార్ అంటూ పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు భారీ క్రేన్ సాయంతో విద్యార్థులను భీకర వదర ప్రవాహాన్ని దాటించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నందిగామ సమీపంలోని హైవేపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యేందుకు తమకు సహాయం చేయాల్సిందిగా కొంత మంది విద్యార్థినీ విద్యార్థులు నందిగామ పోలీసులను అభ్యర్థించారు. విద్యార్థులు సురక్షితంగా పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు హైవేపై క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీ వరదలు అటు లంక గ్రామాలను, విలీన మండలాలను ముంచెత్తాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి మూడో ప్రమాద హెచ్చరిక (53 అడుగులు) జారీ చేయగా.. శనివారం ఉదయం 6 గంటలకు నీటి మట్టం 54.3 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుందటంతో నీటి మట్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది. పరిసర ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొంత మందిని తరలించేందుకు సమాయత్తమయ్యారు.