ఆయన ఓ ఉన్నతాధికారి. వయసు 58 ఏళ్ల ఉంటుంది. కర్ణాటక మాజీ సీఎం దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పని చేశారు. అలాంటి వ్యక్తికి ఓ అమ్మాయితో వీడియో కాల్ చేయించి.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి లక్షలాది రూపాయలు కొట్టేశారు. ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తుండటంతో.. చేసేదేం లేక సదరు అధికారి బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతానికి చెందిన సంజయ్ (పేరు మార్చాం) జూన్ నెలలో ఏదో పని నిమిత్తం మహారాష్ట్రలో నాసిక్ వెళ్లారు. అక్కడ ఓ గెస్ట్ హౌస్‌లో దిగిన ఆయన.. జూన్ 12వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో స్నానం చేసి టవల్ కట్టుకొని బాత్రూమ్ నుంచి బయటకొచ్చారు. టవల్‌లో ఒళ్లు తూడుచుకుంటున్న సమయంలో ఆయనకు గుర్తు తెలియని ఓ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ ఎత్తిన సంజయ్‌కు ఓ మహిళ, ఓ పురుషుడు కనపించారు. వాళ్లెవరూ ఆయనకు తెలీదు. ఆయన కాల్ కట్ చేయడానికి ముందే వాళ్లే ఫోన్ పెట్టేశారు.
దీంతో ఎవరో పొరబాటున తనకు వీడియో కాల్ చేసి ఉంటారనుకున్న సంజయ్ ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. కానీ మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయనకు ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. సంజయ్‌కు కాల్ చేసిన వ్యక్తి.. తన పేరు మహేంద్ర సింగ్ అని.. ఓ హిందీ న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. మీరు ఓ మహిళకు వీడియో కాల్ చేసి.. దుస్తులు విప్పారనే ఫిర్యాదు నాకు అందిందని అతడు చెప్పాడు. మీరు డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు.
అంతకు ముందు రోజు ఫోన్ చేసిన జంట.. వీడియో కాల్‌ను రికార్డ్ చేసి ఉంటారని సంజయ్ భావించాడు. మీరు డబ్బులిస్తే ఆ వీడియోను డిలీట్ చేస్తానని సింగ్ ఆయనకు మాటిచ్చాడు. దీంతో సంజయ్ అతడికి ఓ ఖాతాకు లక్షన్నర, మరో ఖాతాకు రూ.50 వేలు పంపించాడు. మరుసటి రోజు కూడా సంజయ్ నాసిక్‌లోనే ఉండగా.. అతడికి నాలుగు కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ఆ నాలుగు నంబర్ల నుంచి ఫోన్ చేసింది ఒక్కడే. తన పేరు దినేశ్ కుమార్ అని.. సీబీఐలో స్పెషల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నానని అతడు సంజయ్‌కు పరిచయం చేసుకున్నాడు. మీరు న్యూడ్ వీడియో కాల్ చేశారంటూ ఓ మహిళ తనకు ఫిర్యాదు చేసిందని అతడు కూడా సంజయ్‌కు చెప్పాడు. రెండు బ్యాంక్ అకౌంట్ నంబర్లకు డబ్బులు పంపాలని సూచించాడు. దీంతో సంజయ్ ఓ ఖాతాకు రూ.2 లక్షలు, మరో ఖాతాకు రూ.2.8 లక్షలు పంపించాడు. అయినా సరే సంజయ్‌కు వేధింపులు ఆగలేదు. మరో రూ.7.2 లక్షలు పంపించాలని డిమాండ్ చేశారు. అప్పటికే డబ్బులు అయిపోవడంతో బెంగళూరు వెళ్లిపోయిన సంజయ్.. పోలీసు కమిషనర్ బి.దయానందను కలిశారు. ఆయన సూచనల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.