చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన నేపథ్యంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల నడకమార్గంలో భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా నడకమార్గంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి 100 మంది భక్తులను గుంపుగా మాత్రమే నడకమార్గంలో తిరుమలపైకి అనుమతించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఈ 100 మంది భక్తులకు పైలట్‌గా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించింది.
ఇక 7వ మైలు నుంచి నరసింహస్వామి దేవాలయం వరకు హైఅలర్ట్ జోన్‌గా టీటీడీ ప్రకటించింది. దీంతో పాటు భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుపైపు, వెనుకవైపు రోప్ ఏర్పాటు చేయనున్నారు నడకమార్గంలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేయడం, ఈ దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఇవాళ టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. నడకమార్గంలో భక్తులకు భద్రత కల్పనపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, సెక్యూరిటీని పెంచాలని నిర్ణయించారు.
ఇప్పటివరకు మెట్ల ద్వారా ఎవరికి వారు ఒంటరిగా పోతున్నారు. ఇలా పోవడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కాపాడటానికి కూడా ఎవరూ ఉండటం లేదు. ఇలాంటి సమయంలో సహాయం చేయడానికి పక్కన ఎవరూ ఉండే పరిస్థితి ఉండదు. దీంతో ఇక నుంచి 100 మందిని కలిపి ఒక గుంపుగా ఏర్పాటు చేసి పంపనున్నారు. దీని వల్ల ఏదైనా ప్రమాదం జరిగినా ఇబ్బంది ఉండదని, భక్తులు భయపడరని టీటీడీ చెబుతోంది. ఇప్పటివరకు మెట్ల మార్గంలో అక్కడక్కడ మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది మోహరించి ఉంటారు. అయితే ఇప్పటినుంచి 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డు ఉండేలా టీటీడీ చర్యలు తీసుకోనుంది.
అలాగే ఏదైనా ఘటన జరిగినప్పుడు వెంటనే తెలుసుకోవడానిక వీలుగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తాజాగా టీటీడీ అధికారులు నిర్ణయించారు. పిల్లలు ఉన్నప్పుడు వారిని తల్లిదండ్రులు వదిలిపెట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను వదిలేసి పక్కకు వెళుతున్నారు. దీని వల్ల పిల్లలు తప్పిపోయే అవకాశముంటుంది. చాాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో అజాగ్రత్తతో వ్యవహరిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతలను తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు. కాగా లక్షిత మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు. రేపు చిన్నారి అంత్యక్రియలు జరగనున్నాయి. లక్షిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.