రుషికొండ వేదికగా అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రుషికొండను నాశనం చేశారని, అనుమతులు లేకుండా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్మాణలు చేపడుతుందంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో రుషికొండ నిర్మాణాల అంశం గత కొంతకాలంగా ఏపీలో వివాదానికి దారి తీసింది.
ఈ క్రమంలో రుషికొండపై వైసీపీ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతుందంటూ శనివారం వైసీపీ ఓ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన వైసీపీ.. తప్పును సవరించుకుంది. రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్లు నిన్న తాము పోరపాటుగా ట్వీట్ చేశామని, అక్కడ ప్రభుత్వం నిర్మాణాలు మాత్రమే చేస్తున్నట్లుగా పరిగణలోకి తీసుకోవాలని తప్పును సరిదిద్దుకుంది. అయితే అప్పటికే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి రుషికొండపై సీఎం జగన్ సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారంటూ వైసీపీ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం కూడా జరగడం లేదు. సీఎం జగన్ ఉండటానికి క్యాంప్ ఆఫీస్, ఇంటి నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ వైసీపీ తప్పుగా ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొట్టింది. దీంతో చివరికి తప్పును తెలుసుకుని వైసీపీ ట్వీట్ డిలీట్ చేసినా.. దానిపై వివాదం నడుస్తోంది. ట్వీట్‌ను ఎందుకు డిలీట్ చేశారంటూ టీడీపీ ట్రోల్ చేస్తుండటంతో.. ట్విట్టర్ వేదికగా ఆ రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది.
టీడీపీ చేస్తున్న ట్రోల్స్‌కు కౌంటర్ ఇస్తూ వైసీపీ మరో ట్వీట్ చేసింది. మానవ తప్పిదాలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయని, ఇది కూడా అలాగే జరిగిందని తెలిపింది. మేనిఫెస్టోను పార్టీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డిలీట్ చేసే కార్యక్రమం తాము చేయలేదని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చుతున్నట్లు తెలిపింది. పొరపాటు జరిగిందని నిర్భయంగా ప్రజలకి చెప్పగలిగే పరిస్థితిలో తామున్నామని, చంద్రబాబు లాగా ప్రజలను తప్పుదోవ పట్టించి మభ్య పట్టే కార్యక్రమం ఎప్పుడూ చేయలేదని వైసీపీ కౌంటర్ ఇచ్చింది