ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన నేపథ్యంలో టీటీడీ మరింత అప్రమత్తమైంది. చిన్నారులు, భక్తుల భద్రత కోసం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు కీలక నిర్ణయాల దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఇక నుంచి తిరుమల నడకమార్గంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి నిరాకరించారు. రేపటి నుంచి ఈ రూల్ అమల్లోకి తీసుకురానున్నారు. చిన్నారుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 ఏళ్లలోపు చిన్నారులను నడకమార్గంలో అనుమతిస్తారు. ఆ తర్వాత ఇక ఉదయం వరకు అనుమతించరు. అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్టుమార్గంలో టీటీడీ ఈ ఆంక్షలు అమలు చేయనుంది. ఇక రెండో ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 తర్వాత బైక్‌లను టీటీడీ నిలిపివేయనుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రం రెండో ఘాట్ రోడ్డులో బైక్‌లకు అనుమతి ఇస్తారు. రాత్రి వేళల్లో ఇక నుంచి బైక్‌లను అనుమతించమని టీటీడీ స్పష్టం చేసింది. సాయంత్రం తర్వాతనే శేషాచలం అడవుల్లో చిరుతలతో పాటు క్రూరమృగాలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. దీని వల్ల వాహనదారులు కనిపిస్తే దాడి చేసే ప్రమాదముంటుంది. అందువల్ల సాయంత్రం తర్వాత బైక్‌లను అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు.
లక్షితపై దాడి చేసిన చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు నిన్నటి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే బోన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు ఐదు ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు జాడలు గుర్తించారు. అలిపిరి నుంచి గాలిగోపురం 7వ మైలురాయి వద్ద చిరుత కదలికలను అధికారులను గుర్తించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా టీటీడీ నేటి నుంచి పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.
నడకదారిలో చిన్నపిల్లల విషయంలో భద్రతా చర్యలు అమలు చేస్తోంది. చిన్నపిల్లలకు ట్యాగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా నడకదారిలో వచ్చే చిన్నారుల చేతికి తల్లిదండ్రులు ఫోన్ నెంబర్ నమోదు చేస్తున్నారు. 100 మంది భక్తులను కలిపి ఒక గుంపుగా మెట్ల మార్గంలో పంపిస్తున్నారు. నడకమార్గంలో సీసీ కెమెరాల సంఖ్యతో పాటు సెక్యూరిటీని పెంచేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్‌లను నియమించనుంది. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల ఏదైనా ఘటన జరిగినా వెంటనే తెలుస్తుందని, దీని వల్ల సహాయకచర్యలకు కూడా ఇబ్బంది ఉండదని టీటీడీ భావిస్తోంది.