'బేబీ' సినిమాను తలపిస్తున్న విశాఖ మైనర్ బాలిక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంశం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రెండు కుటుంబాల్లో విషాదం, ఒకరి కుటుంబానికి ఇబ్బందులు తెచ్చిపెట్టిన ఈ ప్రేమ వ్యవహారంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చనిపోయేముందు తన ప్రియుడు సూర్యప్రకాశ్‌కు మైనర్ బాలిక రాసిన నాలుగు పేజీల ఎమోషనల్ సూసైడ్ లెటర్ బయటపడింది. ఎవరినీ వదలకూడదని, అందరూ కుక్క చావు చావాలంటూ లెటర్‌లో బాలిక పేర్కొంది.
'నేను లేకపోయినా నా ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు నా రక్తం.. నువ్వు నా ప్రాణం.. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. మరో జన్మలో ఏ కుక్కగానో, పిల్లిగానో పుడతాను. తల్లిదండ్రులు ఇద్దరూ నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. మీ నలుగురు జాగ్రత్త' అంటూ రాసుకొచ్చింది. ఆత్మహత్య చేసుకునేముందు యువతి రాసిన ఈ సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.
కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన ఓ మైనర్ బాలిక(16) స్థానికంగా ఓ కాలేజీలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇందిరానగర్‌కు చెందిన సాయికుమార్, ఆదర్శనగర్‌కు సూర్యప్రకాశ్ అనే ఇద్దరు యువకులు యువతిని ఇష్టపడ్డారు. దీంతో ఇద్దరితోనూ బాలిక చనువుగా ఉండటం మొదలుపెట్టింది. గతంలో సాయికుమార్ బాలికకు రహస్యంగా తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. సాయికుమార్‌తో వివాహమైన తర్వాత కూడా సూర్యప్రకాశ్‌తో బాలిక సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయం ఇద్దరికీ తెలియడంతో ఇటీవల యువతి ఇంటికెళ్లి నిలదీశారు. ఎవరితో ఉంటావనేది తేల్చుకోవాలంటూ గొడవ చేయడంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది.
ఇద్దరూ నిలదీయడం, లవ్ స్టోరీ బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురై మైనర్ బాలిక రెండు రోజుల క్రితం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సూర్యప్రకాష్, సాయి ఒత్తిడి చేయడం వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ యువకులిద్దరిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతుండగా.. విచారణ భయంతో సూర్యప్రకాశ్ గోపాలపట్నం ఆర్ఆర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రన్నింగ్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సూర్యప్రకాశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక మరో యువకుడు సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరిని ఒకేసారి ప్రేమించి యవతి చెసిన తప్పుతో ఇప్పుడు మూడు కుటుంబాలు బాధపడుతున్నాయి.