ఏ ముహూర్తాన కరోనా మహమ్మారి మొదలైందో గానీ.. యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలో నెట్టేసింది. ప్రజల ఆరోగ్యంతో పాటు వారి జీవనోపాధి సహా అన్ని రంగాలను దెబ్బకొట్టింది. మూడేళ్లు గడిచినా ఇంకా కరోనా ప్రభావం నుంచి తెరుకోలేకపోతున్నాం. ఇక, కొందరు దీర్ఘకాలిక కోవిడ్ బాధితులుగా మారిపోయారు. ఇలాంటి బాధితులు అనేక అరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని అసాధారణ కేసుల్లో కోవిడ్ బాధితులు ఒక్క నిమిషం పాటు కూడా నిలబడలేకపోతున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఒక నిమిషం నిలబడితే కాళ్లు ఎర్రబడి.. కాలక్రమేణా నీలం రంగులోకి మారిపోయి, సిరలు ఉబ్బిపోతున్నట్టు ఈ మేరకు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం పేర్కొంది.
దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్న 33 ఏళ్ల వ్యక్తి కాళ్ల సిరల్లో రక్తం చేరికను సూచించే అక్రోసైనోసిస్‌కు గురైన విషయాన్ని ఈ అధ్యయనం వివరించింది. నిలబడిన ఒక నిమిషం తర్వాత అతడి కాళ్లు ఎర్రబడటం ప్రారంభించాయి. కాలక్రమేణా నీలం రంగులోకి మారాయి.. సిరలు మరింత ఉబ్బిపోయాయి అని యూకేకు చెందిన లీడ్స్ విశ్వవిద్యాలయం అధ్యయనం తెలిపింది. 10 నిమిషాల నిలబడిన తర్వాత రంగు మరింత స్పష్టంగా కనిపించిందని, రోగి కాళ్లలో విపరీతమైన దురదను అనుభవించినట్టు బాధితుడు తెలిపాడు.
అయితే, తిరిగి అతడు కూర్చున్న కాసేపటికే రెండు నిమిసాల్లో సాధారణ పరిస్థితికి చర్మం వచ్చేసింది. కోవిడ్-19 సోకినప్పటి నుంచి తనకు ఇలా జరుగుతోందని రోగి చెప్పినట్టు పరిశోధకులు తెలిపారు. ‘కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌కు గురికాక ముందు బాధితుడిలో అక్రోసైనోసిస్ లక్షణాల్లేవని, ఇది అరుదైన కేసు’అని లీడ్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ క్లినికల్ ప్రొఫెఫర్, అధ్యయనకర్త డాక్టర్ మనోజ్ శివన్ అన్నారు.
రోగికి పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాచీకార్డియా సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని కారణంగా నిలబడి ఉన్నప్పుడు హృదయ స్పందన రేటు అసాధారణంగా పెరుగుతుంది. దీర్ఘకాలిక కోవిడ్.. శరీరంలోని హృదయ స్పందన రేటు, రక్తపోటు, శ్వాసక్రియ, జీర్ణక్రియ, లైంగిక ప్రేరేపణ వంటి అసంకల్పిత ప్రక్రియలను నియంత్రించే స్వయంచాలిత నాడీ వ్యవస్థతో సహా శరీరంలోని బహుళ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని తేలింది.
స్వయంచాలిత నాడీ వ్యవస్థ (డైసౌటోనోమియా) పనిచేయకపోవడమే పోస్ట్-వైరల్ సిండ్రోమ్‌ల సాధారణ లక్షణమమైన అక్రోసైనోసిస్‌ను గతంలో పిల్లల్లో గమనించారు. ‘దీని బారినపడ్డ రోగులకు దీర్ఘకాలిక కోవిడ్, డైసౌటోనోమియా లక్షణం అని తెలియకపోవచ్చు.. వారికి ఎదురైన అనుభవం గురించి ఆందోళన చెందుతారు. అదేవిధంగా, అక్రోసైనోసిస్, దీరర్ఘకాలిక కోవిడ్ మధ్య ఉన్న సంబంధం గురించి వైద్యులకు తెలియకపోవచ్చు’ అని శివన్ చెప్పారు. ఇంతకు ముందు శివన్ బృందం చేసిన పరిశోధనలో దీర్ఘకాలిక కోవిడ్ ఉన్నవారిలో డైసౌటోనోమియా, POTS రెండూ తరచుగా అభివృద్ధి చెందుతాయని తేలింది.
క్రానిక్ ఫ్యాటీగ్ సిండ్రోమ్ లేదా ఎంఈగా పిలిచే ఫైబ్రోమైయాల్జియా, మైయాల్జిక్ ఎన్‌సెఫలోమైలిటిస్ వంటి అనేక ఇతర దీర్ఘకాలిక పరిస్థితులలో కూడా డైసౌటోనోమియా కనిపిస్తుంది. ఈ రెండూ కండరాలను ప్రభావితం చేసి, నొప్పిని కలిగిస్తాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తులలో ఈ లక్షణం గురించి మరింత అవగాహన అవసరమని ఈ కేసు నొక్కిచెప్పిందని పరిశోధకులు తెలిపారు.
దీర్ఘకాల కోవిడ్‌లో డైసౌటోనోమియా గురించి మరింత అవగాహన ఉందని మేము నిర్ధారించుకోవాలి.. తద్వారా రోగులకు తగిన విధంగా చికిత్స అందజేయడానికి వైద్యులకు అవసరమైన సాధనాలు ఉన్నాయి’ అని శివన్ అన్నారు. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణా్లోల అలసట, డిప్రెషన్, ఆందోళన వంటి లక్షణాలు ఉన్నాయ. ఇది రోగుల రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని, వారి జీవన నాణ్యతను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కేన్సర్ ముదిరిన రోగుల కంటే అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది.