టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాయిష్ బ్యాంకు సర్వేలో ఏపీ ఆర్ధికస్థితి 8వ స్థానం నుంచి 11వ స్థానంకు దిగజారడానికి కారకులెవరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కంటే ఏపీ 7 స్థానాలు ఎందుకు పడిపోయింది?.. ఇది జగన్ రెడ్డి అసమర్ధత కాదా? అని నిలదీశారు. ఏపీ ఆర్ధికస్థితి ఏడాదికేడాదికి దిగజారుతోందని చెబుతున్నా సీఎం జగన్ పెడచెవున పెట్టారని విమర్శించారు. రాష్ట్రం క్లాసిక్ డెట్ ట్రాప్‌లోకి వెళుతోందని గత నాలుగేళ్లుగా ఏకరవు పెడుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వాస్తవ ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించకుండా పదే పదే అబద్దాలను వల్లెవేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ కంటే వనరులు తక్కువ ఉన్న తెలంగాణ ఆర్ధికస్థితి ఎంతో మెరుగ్గా.. 4వ స్థానానికి వృద్ధిచెందడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడటం జగన్ రెడ్డి చేతగానితనం కాదా? అని ప్రశ్నించారు.