తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో లక్షిత అనే చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తుల భద్రత కోసం మెట్ల మార్గం, ఘాట్‌రోడ్లలో అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇవాళ జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామని, భక్తుల భద్రత దృష్ట్యా ఎంతమందినైనా అటవీశాఖ సిబ్బందిని నియమించుకుంటాంమని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.
తిరుపతి పద్మావతి అతిధి గృహంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైలెవెల్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భూమన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెలన్నర క్రితం నడక దారిలో కౌశిక్ అనే బాలుడిపై జరిగిన చిరుత దాడి, లక్షితపై జరిగిన చిరుత దాడి చేసి చంపేసిన ఘటనలతో అప్రమత్తం అయ్యామని తెలిపారు. భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటవీశాఖ అధికారులతో సమావేశమైనట్లు చెప్పారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే మాత్రమే 15 ఏళ్లలోపు పిల్లలను అనుమతిస్తామన్నారు.
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. రాత్రి పది గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుందని, నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఒక కర్ర అందిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలిపిరి నుండి ఘాట్ రోడ్డులో వెళ్లే ద్విచక్ర వాహనదారులకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు వరకే అనుమతి ఉంటుందన్నారు. భక్తులను గుంపులుగా నడక మార్గంలో పంపేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నడక, ఘాట్ రోడ్డులో జంతువులకు తినుబండారాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాదాపు ఐదు వందల ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, అవసరం అయితే డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తామన్నారు. అవసరం అయితే నడక దారిలో ఫొకస్ లైట్స్‌ను ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీశాఖ అధికారుల నుండి సూచనలు తీసుకున్నామని, కేంద్ర అటవీ శాఖ అధికారులతో ఫెన్సింగ్ ఏర్పాటుపై చర్చిస్తామని కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలిపిరి, ఏడో మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, అప్రమత్తత కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు ఏవిధంగానైనా తిరుమలకు చేరుకోవచ్చన్నారు. వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టే వరకూ ఇవే నిబంధనలు అమలు చేస్తామని వివరించారు.