హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు దేశంలోనే మొదటిసారి లేహ్ రోడ్లపై పరుగులు తీయనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ చేపట్టింది. అత్యంత ఎత్తైన ప్రాంతం లడఖ్‌లో హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోన్న ఎన్టీపీసీ.. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఐదు బస్సులను లేహ్ అధికార యంత్రాంగానికి అందజేసింది. మూడు నెలల పాటు ఫీల్డ్ ట్రయల్స్, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియలు నిర్వహిస్తారు. ఇందు కోసం ఆగస్టు 17న బస్సులు లేహ్‌కు చేరుకున్నాయి.
దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం లేహ్ యంత్రాంగం 7.5 ఎకరాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. అరుదైన వాతావరణం, మైనస్ డిగ్రీలో ఉష్ణోగ్రతల్లో పనిచేసేలా బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడమే ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌తో ఎన్టీపీసీ రెండు ఘనతలు సాధించింది. దేశంలో మొదటిసారి ప్రజా రవాణలో వాణిజ్యపరంగా హైడ్రోజన్ ఇంధనం బస్సుల వినియోగం.. 11,500 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉండే అరుదైన వాతావరణంలో సాంకేతికతను పరీక్షించడం కూడా మొదటిసారి.
బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను 2020 ఏప్రిల్‌లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు ప్రస్తుతం 9 మీటర్ల డీజిల్ బస్సుల్లో ప్రయాణించే ధరకు సమానంగా ఉంటాయి. ‘‘ఏదైనా నష్టం జరిగితే దానిని ఎన్‌టీపీసీ పూడ్చుతుంది’’ అని ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు.
మొదటి బస్సు గురువారం లేహ్‌కు చేరుకుంది, వాస్తవానికి స్వాతంత్య్ర దినోత్సవం రోజున వీటిని ప్రారంభించాలని భావించినా.. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రతికూల వాతావరణంతో సాధ్యపడలేదు. 2020 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కార్బన్-న్యూట్రల్ లడఖ్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
‘హిమాలయాల్లో ఉన్న లడఖ్ కొత్త శిఖరాలకు పురోగమిస్తోంది.. లడఖ్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. మనం వాటిని సంరక్షించడమే కాదు, వాటిని మనం పెంచుకోవాలి. సిక్కిం సేంద్రీయ రాష్ట్రంగా ముద్ర వేసింది. ఈశాన్య ప్రాంతంలో లడఖ్, లేహ్, కార్గిల్‌లు కూడా 'కార్బన్ న్యూట్రల్' యూనిట్‌గా సముచిత స్థానాన్ని సృష్టించుకోగలవు’ అని ప్రధాని చెప్పారు.