ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో చిరుతపులితో ఓ వ్యక్తి సెల్ఫీ,,,,వైరల్ అవుతున్న వీడియో..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 20, 2023, 08:37 PM

తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులులు భయం వెంటాడుతోంది. తిరుపతిలో అలిపిరి నడకమార్గంలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన తర్వాత తిరుమల కొండల్లో 5 చిరుతపులుల కదలికలకు (వేర్వేరు చోట్ల) సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో చిక్కాయి. రెండు చిరుతపులులు బోనులో చిక్కాయి. అటు శ్రీశైలం కొండల్లోనూ చిరుతపులుల భయం కలవరపెడుతోంది. ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామకొండ సమీపంలోని కొండల్లో ఓ చిరుతపులి కనిపించింది. కొండలపై కూర్చొని ఉన్న చిరుతపులితో ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.


తుగ్గలి మండలం రామకొండ గుట్టల్లో ఓ బండరాయిపై చిరుతపులి మాటువేసి కిందకి చూస్తోంది. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఆ చిరుతపులిని గమనించి, మరో వైపు నుంచి గుట్టపైకి చేరుకున్నారు. ఆ చిరుతపులితో తమ సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో చిత్రీకరించుకున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు గొర్లకాపర్లని తెలుస్తోంది. ఏదేమైనా చిరుతపులితో వారు సెల్ఫీ వీడియో తీసుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. వారి చేతుల్లో కనీసం కర్రలు కూడా లేనట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. పులితో చెలగాటం ఏంటో మరి! ఈ వీడియో వైరల్ కావడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com