తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఇరువైపుల ఇనుప కంచె ఏర్పాటు చేసేలా రాష్ట్రప్రభుత్వం, టీటీడీ, అటవీశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వన్యప్రాణుల దాడి నుంచి భక్తులను రక్షించేందుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని పిల్‌లో కోరారు. టీటీడీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది ఆగస్టు 11న చిరుత దాడిలో బాలిక ప్రాణాలు కోల్పోయిందని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. కంచె ఏర్పాటు చేసి భక్తులను పులుల బారి నుంచి కాపాడాలని పిల్‌లో పేర్కొన్నారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు అలిపిరి నడకమార్గంలో లక్షితపై చిరుతదాడి జరిగి రోజులు గడుస్తున్నా.. మెట్లమార్గంలో వెళ్తున్న భక్తుల్లో భయం తగ్గడం లేదు. భయం భయంగానే గోవింద నామాలు జపించుకుంటూ కొండెక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో విషయం వెలుగులోకి వచ్చింది. కాలినడక దారిలో ఇప్పటి వరకూ మూడు చిరుతలు తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే మొత్తం ఐదు చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ, టీటీడీ అధికారులు... అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్షితపై చిరుతదాడి తర్వాత కాలినడకమార్గంలో రెండు చిరుతలను అధికారులు బంధించారు. మిగతా చిరుతల్ని బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ చిరుత బోన్ దగ్గరికి వెళ్లినట్టే వెళ్లి పక్క నుంచి వెళ్లిపోగా... ఓ ఎలుగుబంటి కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు గుర్తించారు. వీటిని బంధించాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాలినడకమార్గాల్లో 320కిపైగా ట్రాక్ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు చేసి ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ చిరుతలో వేయిమంది సిబ్బంది పాల్గొంటుండగా.. అవసరమైతే ట్రాప్ కెమెరాలు.. అధునాతన బోన్లతో పాటు సిబ్బందిని పెంచాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు జులై నుంచి సెప్టెంబర్ నెల వరకూ జంతువుల సంపర్క సమయం అంటున్న అధికారులు.. అందువల్లనే వన్యమృగాల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్ని చిరుతలు ఉన్నాయనే దానిపై స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు . అయితే ట్రాప్ కెమెరాల్లో చిక్కుతున్న చిరుతల దృశ్యాలను గమనిస్తే వీటిసంఖ్య అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీటిని బంధించేందుకు ఆపరేషన్ చిరుత కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులకు.. అడవి జంతువుల నుంచి రక్షణగా టీటీడీ చేతి కర్రను అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నడకదారిలో 12 ఏళ్లలోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 వరకు మాత్రమే అనుమతిస్తారు.. అలాగే రాత్రి 10 తర్వాత పెద్దల్ని కూడా అనుమతించరు.