అంతరిక్ష రంగంలో ఏ దేశం సాధించని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపి ఇస్రో లిఖించిన ఘన కీర్తి గురించి ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. చంద్రయాన్ 3 అద్భుత విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలపై గౌరవం మరోస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఇస్రో సైంటిస్ట్‌లపై అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. అయితే చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సక్సెస్‌ఫుల్‌గా దిగిన సమయంలో భారత్‌లో లేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ అద్భుత ఘట్టాన్ని వర్చువల్‌గా తిలకించారు. అయితే విదేశాల నుంచి తిరిగి రాగానే.. ఇస్రో శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి అభినందనలు తెలపనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఇస్రో శాస్త్రవేత్తలను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శనివారం కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరుకు వెళ్లి ఇస్రోకు చెందిన టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్)ను సందర్శించనున్నారు. అనంతరం ఇస్రో సైంటిస్ట్‌లతో మోదీ భేటీ కానున్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆ తర్వాత ఉదయం 8.05 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 8.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారని తెలిపింది. ఈ క్రమంలోనే ప్రధాని పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం 4.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రధాని ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
ఈ క్రమంలోనే బెంగళూరుకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక వెల్లడించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆదేశాలతో బెంగళూరు నగరంలో 10 వేల మందితో భారీ రోడ్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి అక్కడ పర్యటించనున్నారు. ప్రధాని మోదీకి.. బెంగళూరులోని హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పర్యటన తమకు ఉపయోగపడుతోందని కర్ణాటక బీజేపీ భావిస్తోంది. అలా చేస్తే కమలం పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం లభించి సార్వత్రిక ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని యోచిస్తోంది.