తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ యార్డులో నిలిపి ఉంచిన రైల్లో మంటలు చెలరేగిన 10 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, రైల్లో అక్రమంగా తీసుకెళ్లిన గ్యాస్ సిలిండర్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. దీంతో పాటు వంట చెరకు, బొగ్గును గుర్తించినట్టు రైల్వే పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. వంట కోసం ఏర్పాట్లు టాయిలెట్ ప్రాంతంలో ఒక చివర ఉన్నాయని అధికారి పేర్కొన్నారు. లక్నో స్టేషన్ నుంచి కోచ్ బయలుదేరిన తర్వాత గ్యాస్ సిలిండర్‌ను అక్రమంగా రవాణా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఉల్లంఘనకు పాల్పడిన ట్రావెల్ ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లక్నో రైల్వే అధికారులకు తెలియజేసినట్లు దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్ సింగ్ తెలిపారు. ఈ నెల 17న లక్నో నుంచి 64 మంది ప్రయాణికులతో తమిళనాడుకు మరో రైలుకు అనుసంధానమై వచ్చిన ఈ కోచ్ శనివారం రామేశ్వరం వెళ్లాల్సి ఉంది. ఆదివారం తిరిగి చెన్నైకి చేరుకుని... అనంతరం లక్నో వెళ్లే షెడ్యూలు ఉంది. ఈలోపే మదురై జంక్షన్ యార్డులో ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యింది. ఘటనలో చనిపోయి 9 మంది మృతులను గుర్తించారు.
మృతులంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారేనని తెలిపారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. బాధితులను పరమేశ్వర్ కుమార్ గుప్తా (55), శత్రు దమన్ సింగ్ (65), అన్‌కుల్ కశ్యప్ (36) దీపక్ కశ్యప్ (20), హరీశ్ కుమార్ భాసిన్ (60), హిమనీ బన్సాన్ (22), మిథిలేశ్ కుమారి (62), శాంతి దేవి వర్మ (57), మనోరమ అగర్వాల్ (82)గా గుర్తించారు. మరో 8 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన విషయాలు సందేహానికి తావిస్తున్నాయి. వైరల్ అయిన పలు వీడియోల్లో చూస్తే.. పేలుడు జరగక ముందే కోచ్‌లో మంటలు బాగా వ్యాపించాయి. అవి ఎలా వచ్చాయనేది తెలియాల్సి ఉంది. మరోవైపు, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి శనివారం అర్ధరాత్రి రోడ్డుమార్గాన చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కోచ్‌లో ఉన్నవారు బయట పడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. వెలుతురులేకపోవడం, పొగలు విపరీతంగా వ్యాపించడంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అత్యవసర కిటికీలు కూడా తెరుచుకోడానికి మొరాయించడంతో వాటిని పగులగొట్టి బయటికి దూకేసినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆ కిటికీలకు దూరంగా ఉన్నవారు మాత్రం మంటల్లో చిక్కుకుని కాలిపోయారు. ముందు, వెనుక డోర్లు లాక్ అయిపోయాయి. ఒక కోచ్ నుంచి మరోదానికి వెళ్లే ద్వారం సైతం తాళం వేసి ఉంది.