కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ భద్రతా బలగాల్లో పనిచేసే వారు యూనిఫామ్‌లలో, ఆఫీసులు, పని ప్రదేశాల్లో ఫోటోలు, దిగడం.. రీల్స్ చేయడం.. వాటిని సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. అయితే ఇవే ఇప్పుడు ప్రత్యర్థి దేశాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఆ ఫోటోలు, వీడియోల ఆధారంగా వారికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మహిళలను ఎరగా వేసి దేశ రహస్యాలు, కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో కేంద్ర ప్రభుత్వ బలగాల ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో భద్రతా బలగాలు ఎవరైనా సోషల్ మీడియాలో ఫోటోలు గానీ వీడియోలు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది.
భద్రతా బలగాల్లో పనిచేస్తున్న వ్యక్తులను హనీట్రాప్‌లోకి దించి.. దేశానికి సంబంధించిన సున్నితమైన డేటాను కాజేస్తున్న ఘటనలు పెరుగుతుండటంతో కేంద్ర పోలీసు బలగాలకు కీలక హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌షిప్‌ల జోలికి వెళ్లొద్దని, సోషల్ మీడియాల్లో రీల్స్ చేయొద్దని హెచ్చరించాయి. ఇలాంటి వాటి వల్ల హానీట్రాప్ కేసులు పెరుగుతున్నాయని.. దీనివల్ల కీలకమైన సమాచారాన్ని పొరుగు దేశాలకు చేరుతుందని గుర్తించాయి. దీంతో కేంద్ర నిఘా సంస్థలు పరిశోధన చేశాయి. ఇందులో కొందరు సిబ్బంది యూనిఫామ్‌లో ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు గుర్తించింది. అంతే కాకుండా కీలకమైన, రహస్య ప్రాంతాల్లో దిగిన ఫొటోలను కూడా షేర్ చేసినట్లు గుర్తు చేశాయి. దీనిపై కేంద్ర పారామిలిటరీ, పోలీసు బలగాలకు లేఖ రాశాయి.
ఈ క్రమంలోనే అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీపీబీ.. తమ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి. యూనిఫామ్‌లో ఉన్న వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయొద్దని.. పరిచయం లేని వారితో ఆన్‌లైన్‌లో ఫ్రెండ్ షిప్ చేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించాయి. మరోవైపు.. ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా కూడా తమ బలగాలకు ఇలాంటి హెచ్చరికలే చేశారు. డ్యూటీలో ఉన్నపుడు సోషల్ మీడియాను వినియోగించొద్దని.. కీలక సమాచారాన్ని పోస్ట్ చేయొద్దని తెలిపారు. యూనిఫామ్‌లో రీల్స్, వీడియోలు వంటిని చేయొద్దని సూచించారు. భారీ సెక్యూరిటీ ఉండే ప్రాంతాలు, ప్రముఖులకు సంబంధించిన వీడియోలు తీయొద్దని ఆదేశాలు జారీ చేశారు. భద్రతా బలగాల్లో పనిచేసే వారిని గుర్తించి వారికి ఆన్‌లైన్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించి మహిళలతో ఎర వేస్తారు. ఆ తర్వాత మెల్లగా వారితో స్నేహం చేసి.. దేశ రహస్యాలు, రహస్య ప్రాంతాలు, భద్రతకు సంబంధించి సమాచారాన్ని రాబడతారు. నగ్నంగా ఫోటోలు, వీడియోలు పంపడం వాటితో వారిని బెదిరించడం వంటివి చేస్తారు. ఇలాంటి ఘటనలతో కొంత మంది ప్రాణాలు తీసుకున్నావారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర భద్రతా బలగాలు ఈ ఆదేశాలు జారీ చేశాయి.