ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో ఆయన తన ప్రసంగాన్ని ఆపేశారు. అనంతరం ఆయనకు వైద్యం అందజేయాలని తన టీమ్‌లోని వైద్యులకు సూచించారు. ఈ ఘటన ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో శనివారం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటలన ముగించుకుని శనివారం ఉదయం నేరుగా ప్రధాని బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి చేరుకున్నారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను నేరుగా కలిసి.. వారిని ప్రధాని అభినందించారు.
అక్కడ నుంచి మధ్యాహ్నం బయలుదేరి.. ఢిల్లీకి చేరిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ ఏర్పాట్టు చేసింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ కార్యకర్తలు పాలం విమానాశ్రయాని భారీగా చేసుకుని, ‘మోదీ.. మోదీ’ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడాన్ని ఆయన గమనించారు. బాధితుడు కళ్లుతిరిగి కిందపడిపోవడంతో వెంటనే తన ప్రసంగాన్ని ఆపి.. సహాయం చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. ఎండ వేడిమికి తాళలేక అస్వస్థతకు గురైన అతడికి సపర్యలు చేయాలని, బూట్లు తీసేయాలని పక్కనే ఉన్నవారికి ప్రధాని సూచించారు. కొద్ది సేపటి తర్వాత మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
‘దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యాను.. ఈ సమయంలో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై దిగడంతో తనకు అభినందనలు వెల్లువెత్తాయి.. ప్రపంచం మొత్తం భారత్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపింది.. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివ్ శక్తి’ అనే పేరు పెట్టాం’ అని వివరించారు. కాగా, అంతకు ముందు బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు బీజేపీ నేతలు దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. బెంగళూరుకు ప్రధాని వస్తున్నట్టు తెలియగానే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇందు కోసం 20 వేల మంది కార్యకర్తలను సిద్ధం చేసింది. అయితే, పార్టీ ఆశలపై మోదీ నీళ్లు కుమ్మరించారు. రోడ్ షో కాదు కదా కనీసం పార్టీ జెండాలు ఊపినా ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కనీసం విమానాశ్రయం వద్దనైనా పార్టీ నేతలతో ఆహ్వానాన్ని స్వీకరించేందుకు కూడా మోదీ అంగీకరించలేదని సమాచారం. దీంతో మాజీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు రహదారికి ఇరువైపులా సాధారణ పౌరుల్లా నిలబడి ప్రధానికి అభివాదం చేయడం గమనార్హం.