ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో చెట్లు కొట్టనే లేదని, అక్కడ అసలు కాలువలు, కుంటలు లేవని ఏయూ ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. అక్కడ కూడా ఏయూ అధికారులు ఎటువంటి చెట్లు కొట్టలేదని పేర్కొన్నారు. దాంతో చెట్లు కొట్టేసినా రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మూర్తి యాదవ్ మరో పిటిషన్ వేశారు. తద్వారా ఏయూలో చెట్ల నరికివేత వాస్తవమేనంటూ జిల్లా అటవీ శాఖాధికారి నివేదిక అందజేశారు. ఈ ఏడాది మార్చిలో ఏయూలో 406 టేకు చెట్లు నరికి వేశారని, అనుమతులు లేకుండా వాటిని తరలించారని వివరించారు. ఈ వ్యవహారంలో ఏయూ రిజిస్ట్రార్‌పై 36/20213, 179/2023 నంబర్లతో వేర్వేరు కేసులు నమోదు చేశామని డిప్యూటీ రేంజర్ బి.కోటేశ్వరరావు కోర్టుకు వివరాలు సమర్పించారు. వాటి విలువ సుమారు రూ.11.47 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.