శ్రీకాకుళం జిల్లా పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు నెలల క్రితం జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివేకానందుడి విగ్రహాన్ని 17 ఏళ్ల యువకుడు ధ్వంసం చేశాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రివేళ కొందరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి వెళ్లారు. అప్పటికే వారు మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నట్లు వీడియో దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ఒక యువకుడు కర్రతో వివేకానందుడి విగ్రహాన్ని ధ్వసం చేశాడు. కాలితో తన్నుతూ విగ్రహంపై గుట్కా కూడా ఉమ్మేశాడు. వివేకానందుడ్ని తిడుతూ మట్టితో కొట్టారు. అంతటితో ఆగకుండా దిమ్మె నుంచి విగ్రహాన్ని తొలగించి రోడ్డుమీద పడేశారు. అక్కడే ఉన్న కొందరు యువకులు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న యువకుడిని ప్రోత్సహిస్తూ మొబైల్‌తో వీడియో తీశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువజన సంఘాలు భగ్గుమన్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడ్ని ప్రొత్సహించిన మరో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు తెలిపారు.