గ్రామా, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారికీ ఈ మధ్య కాలంలో పదోన్నతులు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల పదోన్నతుల వ్యవహారం గందరగోళంగా మారింది. మున్సిపల్ శాఖ కింద పనిచేస్తున్నందున ఆ శాఖకు సంబంధించి గానీ లేదా విద్యాశాఖకు చెందిన విధులు నిర్వర్తిస్తున్నందున ఆ శాఖకు సంబంధించి అయినా పదోన్నతి చానల్ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మాత్రం వీరికి రెవెన్యూ శాఖలో ఇచ్చింది. ఇటీవల పదోన్నతి చానల్ రూపొందిస్తూ... వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు వార్డ్ అడ్మిన్ సెక్రటరీలు అవుతారని ఆదేశాలిచ్చింది. దీంతో మున్సిపల్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు రెవెన్యూలో పదోన్నతి ఇవ్వడమేంటని వీరంతా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు.