ప్రజలందరికీ పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందేలా అత్యాధునిక సదుపాయాలతో ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. నాబార్డు నిధులు రూ.3కోట్లతో 50పడకల స్థాయితో నిర్మించిన ఏలేశ్వరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రం నూతన భవనాల ప్రారంభోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య సమన్వయాధికారి పి.విష్ణువర్ధిని, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జువ్విన వీర్రాజు, సూపరింటెండెంట్ జి.ఎస్.కె.శైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌తో కలసి ఎంపీ గీత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి జనరల్, ఆర్ధోపెడిక్, గైనిక్ తదితర వార్డుల విభాగాలను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటైన సభలో వారు మాట్లాడుతూ రోగుల సంఖ్య పెరగడంతో 30 పడకలతో శిథిలావస్థ భవనాలతో ఉన్న సీహెచ్‌సీను 50పడకల స్థాయికి పెంచి ఆధునీకరణ పూర్తిచేశామన్నారు. త్వరలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న యర్రవరంలో మరో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంజూరు చేయించే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.