మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఉత్సవాల్లో గురువారం ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంత్రాలయానికి వచ్చారు. ఈయనకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎస్పీ జి.కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్ ఎస్‌కే శ్రీనివాసరావు, ఐపీనరసింహమూర్తి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ముఖద్వారం వద్ద వేద పండితుల మంత్రోచ్ఛరణాల నడుమ గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామి బృందావనానికి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో సహా దర్శించుకుని హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు, విచారణకర్త శ్రీనివాస్‌ఖస్బే, రిటైర్డు జోనల్ మేనేజర్ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. మూడో రోజు ఉత్సవాల్లో పూర్వారాధనలో భాగంగా యోగీంద్ర కళామండపంలో గురువారం రాత్రి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాఘవేంద్ర ప్రశస్తి అవార్డును అందుకున్నారు.