నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌ను అక్కడి అగ్రవర్ణాల ఆధిపత్య నాయకులు చిన్నచూపు చూసి ప్రొటోకాల్ కార్యక్రమాలకు పిలువకుండా అవమానిస్తుండటం దుర్మార్గమని గిరిజన ప్రజాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ అన్నారు. గురువారం స్థానిక కార్యాలయ ఆవరణలో రాజునాయక్ మాట్లాడారు. రిజర్వేషన్ల ప్రకారం పదవులు మాత్రం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చి పెత్తనాన్ని అగ్రవర్ణాలతో చేయించడమే లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో పెత్తందారుల పెత్తనాన్ని అణిచివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్, నీటి యాజమాన్య బోర్డు, సింగిల్ విండో చైర్మెన్‌లు, డైరెక్టర్ పదవులను స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా చేయడమే కాకుండా ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌ను ఆహ్వానించకపోవడం తగదని అన్నారు. నియోజక వర్గంలో వార్డు మెంబరుగా కూడా గెలువలేని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎస్సీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసి వ్యవహరిస్తుండటం తగదని అన్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు ప్రమాణ స్వీకారానికి హాజరైన వైసీపీ ముఖ్య నాయకులందరూ ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టుతామని హెచ్చరించారు. జీపీఎస్ రాష్ట్ర నాయకులు, పలువురు పాల్గొన్నారు.